Gudivada Amarnath On AP Capital : విశాఖ రావడానికి రెడీగా ఉండండి.. వచ్చే ఏడాది నుంచి వైజాగ్ నుంచే పాలన-మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచే పాలన నడుస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు రావడానికి అంతా రెడీ కావాలంటూ సూచించారు.

Gudivada Amarnath On AP Capital : విశాఖ రావడానికి రెడీగా ఉండండి.. వచ్చే ఏడాది నుంచి వైజాగ్ నుంచే పాలన-మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated On : September 16, 2022 / 7:04 PM IST

Gudivada Amarnath On AP Capital : మూడు రాజధానులపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచే పాలన నడుస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు రావడానికి అంతా రెడీ కావాలంటూ సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. మూడు రాజధానులపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామన్నారు. అయితే అది ఎప్పుడన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు రావడానికి అంతా రెడీ కావాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి.

శుక్ర‌వారం నాటి అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయనీ వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌, క‌ర్నూలు రాజ‌ధానులుగా మారుస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో తాము వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. వ‌చ్చే ఏడాది నుంచి ఏపీ పాల‌న విశాఖ నుంచే సాగుతుంద‌ని కూడా మంత్రి గుడివాడ చెప్పారు. విశాఖ‌లో రాజ‌ధాని కోసం సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోలేద‌ని ఆయన వెల్లడించారు.

”మా పాలసీలో ఎక్కడా మార్పు లేదు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం. త్వరలోనే ముడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో పెడతాం. ఆ విధంగానే అన్నీ జరుగుతాయి. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు వచ్చేందుకు అంతా రెడీగా ఉండండి” అని మంత్రి అమర్ నాథ్ అన్నారు. ఏపీ రాజ‌ధాని, రాష్ట్ర పాల‌న గురించి మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ చేసిన వ్యాఖ్య‌లు చర్చనీయాంశంగా మారాయి.

ఇక అమ‌రావ‌తి టు అర‌స‌విల్లి అంటూ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పైనా మంత్రి అమ‌ర్‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ ప‌రిధిలో రైతుల పాద‌యాత్ర‌లో ఏం జ‌రిగినా దానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబే బాధ్యుడ‌ని అన్నారు.

‘వికేంద్రీకరణపై త్వరలో బిల్లు పెడతాం. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానం. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తాం. అమరావతిలో రాజధాని పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృధ్ధి చేస్తాం. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలపై టీడీపీ నేతలు ఆధారాలు చూపాలి. విశాఖలో రాజధానికి ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అమరావతి రైతుల పాదయాత్రలో ఏం జరిగినా అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని మంత్రి అమర్నాథ్ అన్నారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని మంత్రి అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో చెప్పిందని గుర్తుచేశారు. రాజధాని విశాఖ తరలించేందుకు అవసరమైన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ జరగనుందన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందన్నారు మంత్రి అమర్నాథ్. 301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకి అసెంబ్లీకి వచ్చే చిత్తశుద్ధి, గౌరవం లేదని విమర్శించారు. ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నెంబర్ 1 అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.