అలర్ట్: మరో 2 రోజులు వానలే

హైదరాబాద్: రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు. గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు వాన పరిస్ధితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా నీరు నిల్వలేకుండా చేస్తున్నారు. ఈ వానలు మరో 2 రోజులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం, హిందూమహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వద్దగల ఉపరితల ద్రోణి బలహీనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్నిచోట్ల రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్రలో ఈరోజు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వడగండ్ల వర్షంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రాయలసీమలోఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మొత్తంగా ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఆధికారులు తెలిపారు.