భూముల లావాదేవీలన్నీ గ్రామాల్లోనే – సీఎం జగన్

భూముల లావాదేవీలన్నీ గ్రామాల్లోనే – సీఎం జగన్

Updated On : December 21, 2020 / 2:04 PM IST

All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్పడితే..దాని అసలు యజమాని బాధ ఎలా ఉంటుందో తాను చూడడం జరిగిందన్నారు. భూ లావాదేవీల విషయంలో భూతద్దం వేసి వెతికినా..లోపం కనిపించకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’ ( YSR Jagananna Saswatha Bhoo Hakku-Bhoo Raksha scheme) ప్రారంభించారు. తక్కెళ్లపాడు (Takkellapadu)లో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ (CM Jagan) మాట్లాడుతూ…

భూమి పాడి ఆవులా మారింది :-
భూమి అన్నది..దిగజారుడు వ్యక్తులకు, రౌడీలకు, గూండాలకు వ్యవస్థలను మేనేజ్ చేయగలగే వ్యక్తులకు..తమది కాని భూమి..పాడి ఆవులా మారిందన్నారు. రికార్డులను, వ్యవస్థలను మార్చేయడం..జెండా పాతేయడం చేశారని..ఇది మారాలన్నారు. వివాదాల్లో ఉండే భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని చెప్పి ఏకంగా ఆరాటపడే బ్రోకర్లు, రౌడీలు కనబడుతున్నారన్నారు. దీని నుంచి స్వాతంత్ర్యం రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పరాయి భూములు, కబ్జాలతో కోట్లకు ఎలా పడుగెత్తాలనే ఆలోచన ప్రస్తుతం నెలకొందన్నారు. తాను నిర్వహించిన పాదయాత్రలో ఇలాంటి పరిస్థితిలు చూడడం జరిగిందని, దీనిని మార్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో…ఏదైనా భూమికి సంబంధించి..వ్యవహారాలు..వివరాలు కావాలంటే..ప్రస్తుతం నాలుగు శాఖల (రెవెన్యూ, సర్వే సెటిల్ మెంట్, భూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్, స్థానిక సంస్థలు) పరిధిలో ఉన్నాయన్నారు.

నాలుగు డిపార్ట్ మెంట్‌ల మధ్య సమన్వయం లేదు :-
ఇన్ని శాఖల మధ్య..భూ వ్యవహారాలు, భూమికి సంబంధించిన వివరాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. ఒక డిపార్ట్ మెంట్ చేసే పని మరొక డిపార్ట్ మెంట్ కు తెలియని విధంగా శాఖలున్నాయన్నారు. నాలుగు డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల..సమస్యలు వస్తున్నాయని, భూమి వినియోగం, భూ హక్కుల గురించి వివరాలు తెలుసుకోవాలంటే..ఒక సామాన్యుడు ఇన్ని శాఖలు తిరగాల్సి వస్తోందన్నారు. భూమికి సంబంధించిన టైటిల్ మాత్రం ఏ ఒక్క శాఖకు లేదన్నారు. భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి…డబ్బు కట్టి..రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు..కాబట్టి..అతనిదేనా భూమి అంటే గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. అసలైన పట్టాదారు ఎవరు ? సాగుదారుడు ఎవరు ? రికార్డుల్లో నమోదైనవి కరెక్టుగా ఉన్నాయంటే..సరియైన సమాధానం లేదన్నారు. అందుకే రాష్ట్రం ఒక మోడల్‌గా ఉండాలనే ఉద్ధేశ్యంతో భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందని సీఎం జగన్ తెలిపారు.