GVL Narasimharao: కొత్త మంత్రులంతా ఉత్తుత్తి మంత్రులే: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులను తొలగించేలా నిర్ణయాధికారం ఎక్కడినుంచి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు.

GVL Narasimharao: కొత్త మంత్రులంతా ఉత్తుత్తి మంత్రులే: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

Gvl

Updated On : April 11, 2022 / 6:52 PM IST

GVL Narasimharao: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా..ఆయా మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తయింది. కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కొత్త‌ కేబినెట్ పై పలువురు రాజకీయ ప్రముఖులు పెదవి విరిచారు. మంత్రివర్గ కూర్పుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం 10టీవీతో మాట్లాడిన ఆయన అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు పాలకపక్షాన్ని అతలాకుతలం చేస్తున్నాయని..అలకలు, ఆక్రందన పర్వం..అసమ్మతి సెగలను అధికార పక్ష నేతల్లో చూస్తున్నామని జీవీఎల్ అన్నారు. నాలుగు రోజుల క్రితం మేమంతా ఒకటే అన్న పార్టీలో..ఇప్పుడు మాజీ మంత్రులు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని దీంతో వైసీపీపై రియల్‌ పిక్చర్ ప్రజల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. మంత్రి పదవి రాలేదని ఏడ్చే సీన్లు, అధిష్టానాన్ని నిందించడాలు గతంలో ఎప్పుడూ లేవని..వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటివి చూస్తున్నామంటూ జీవీఎల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also read:Kottu Satyanarayana : టీడీపీ, బీజేపీకి మత రాజకీయాలు అలవాటు- మంత్రి కొట్టు సత్యనారాయణ

ప్రజాస్వామ్యంలో అధికారం అనేది నలుగురిని కలుపుకొని పోవాలి..కాని ఇలా అసమ్మతి మూటగట్టుకోకూడదంటూ అధికార వైకాపా నేతలనుద్దేశించి జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రులు రాకపోవడం..మంత్రి పదవులు రాని వారు రోడ్లెక్కడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మాజీ మంత్రులు సుచరిత, బాలినేని, అన్నా రాంబాబు, సామినేని, కొలుసు పార్ధసారదీతొ పాటు మిగతా మాజీ మంత్రుల ఆందోళన కంజగన్ కు కనబడడం లేదా అని జీవీఎల్ ప్రశ్నించారు. మంత్రివర్గంలో నుంచి తీసేస్తామన్న వారిని ఎందుకు కొనసాగించారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులను తొలగించేలా నిర్ణయాధికారం ఎక్కడినుంచి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు. మంత్రివర్గ కూర్పులో సజ్జల పాత్రేమిటో సిఎం జగన్ సమాధానం చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.

Also read:AP Cabinet : ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రుల అలకలు చూస్తుంటే జగన్ 15 రోజులు ఓదార్పు యాత్ర చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేసిన ఎంపీ జీవీఎల్..మీకు సమయం లేకుంటే మీ తరపున మేము స్వయంగా వెళ్లి వైసీపీలో అలక బూనిన ప్రజాప్రతినిధులను ఓదారుస్తామంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గత మంత్రివర్గంలోనూ..ప్రస్తుత కేబినెట్ లోనూ కమ్మ, వైశ్య, క్షత్రియ కులాల మంత్రులను సీఎం జగన్ తొలగించారని జీవీఎల్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫులే జయంతి రోజున జగన్ బీసీలకు ఇచ్చింది ఉత్తిత్తి మంత్రి పదవులని, ఇప్పుడున్న వారంతా ఉత్తుత్తి మంత్రులే అంటూ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించిన జీవీఎల్..జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని అన్నారు.

Also read:Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి