ఫ్యామిలీ ఫ్యామిలీనే.. పాలిటిక్స్ పాలిటిక్సే.. స్కెచ్ ఏంటి.. ఏం జరగబోతుంది?
ఇప్పుడీ ఫేక్ డిగ్రీ వివాదం చుట్టుకునేలా ఉందంటూ జిల్లావ్యాప్తంగా గాసిప్ వినిపిస్తోంది.

ఆ ఇద్దరు నేతలు మామా అల్లుళ్లు. కుటుంబాలు కూడా దగ్గరే ! ఐతే రాజకీయంగా మాత్రం.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు.. మాటల తూటాలు వదులుకుంటారు. సవాళ్లు విసురుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ఇక వాళ్లు వేసే పొలిటికల్ స్కెచ్‌లతో రాజకీయం కూడా అవాక్కయ్యే పరిస్థితి.
అధికారంలో ఉన్నప్పుడు అల్లుడికి మామ చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అల్లుడు.. మామ పొలిటికల్ కెరీర్‌కే ఎర్త్ పెట్టే స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆముదాలవలస రాజకీయం అంతంత కాదయా అనిపిస్తోంది. ఇంతకీ మామ తమ్మినేనికి.. అల్లుడు కూన వేసిన స్కెచ్ ఏంటి.. ఏం జరగబోతోంది.
ఫ్యామిలీ ఫ్యామిలీనే.. పాలిటిక్స్ పాలిటిక్సే అనిపిస్తుంటుంది ఆ ఇద్దరు నేతలు చూస్తే ! శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సిక్కోలు ముఖచిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన బొడ్డేపల్లిలాంటి వారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్లే ! ఆయన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమ్మినేని సీతారాం.. రాజకీయాల్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మేనల్లుడు కూన రవి ఎంట్రీ ఇచ్చారు.
ఐతే ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉండడం.. ఆయా పార్టీల్లో కీలక నేతలుగా ఉండడంతో.. ఆముదాలవలస గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇద్దరి మధ్య రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు.. పాలిటిక్సే అవాక్కయ్యేలా చేస్తుంటాయ్. అలాంటి ఆముదాలవలసలో ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మామ పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేలా అల్లుడు కూన రవి వేసిన స్కెచ్.. ఇప్పుడు యమా హీట్ పుట్టిస్తోంది.
తరచూ మాటల యుద్ధం
గత దశాబ్దకాలంగా కూన, తమ్మినేని కుటుంబాల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో కూన రవి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కింది.
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ్మినేని సీతారాం.. కూన రవిని ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. ఐతే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూన రవిపై తమ్మినేని విజయం సాధించారు. ఏకంగా స్పీకర్ సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వరుస కేసులతో అల్లుడిని రోజుకో రకంగా ముప్పు తిప్పలు పెట్టారనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయ్. ఐనా సరే.. ఎక్కడా తగ్గని కూన రవి.. పోరాటం చేస్తూనే వచ్చారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో విజయంతో సీన్ మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాంపై.. కూన రవి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ పీయూసీ చైర్మన్ పదవి కూడా పొందారు. ఐతే ఇప్పుడు ఆయన తమ్మినేనిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫేక్ డిగ్రీతో తమ్మినేని లా కోర్సులో జాయిన్ అయ్యారంటూ.. రెండేళ్లుగా పోరాటం చేస్తున్న కూన రవి.. రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేశారు.
ఐతే ఆ సమయంలో సీతారాం స్పీకర్‌గా ఉండడంతో.. డిగ్రీ వ్యవహారంపై విచారణ జరిపించేందుకు అప్పటి అధికారులు సాహసం చేయలేదు. ఐతే ఇప్పుడు అధికారంలో ఉండడంతో.. మరోసారి తమ్మినేనిపై కూన రవికుమార్ పోరాటం మొదలుపెట్టారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
ఫేక్ డిగ్రీ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కూన రవి మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నిజానిజాలు త్వరగా నిగ్గు తేల్చాలని చెప్పింది. దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదా కాదా అనేది తేలబోతోంది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో.. డిగ్రీ డిస్‌కంటిన్యూ అని తెలిపారు. మరి ఈ డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడిది.. ఎలా వచ్చిందనేది దర్యాప్తులో తేలనుంది.
ఇప్పటికే ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించి.. పార్లమెంట్ పరిశీలకుని పాత్రకు పరిమితం చేసిందని ఫీల్ అవుతున్న తమ్మినేని మెడకు.. ఇప్పుడీ ఫేక్ డిగ్రీ వివాదం చుట్టుకునేలా ఉందంటూ జిల్లావ్యాప్తంగా గాసిప్ వినిపిస్తోంది. విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుందో.. ఈ వివాదం నుంచి తమ్మినేని ఎలా బయటపడతారో.. మామా అల్లుళ్ల యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారని రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తోంది.