అమరావతి నిర్మాణం కోసం రూ.6,800 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర
అమరావతికి ఇప్పటికే రూ.6,700 కోట్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో అమరావతికి రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. రూ.6,800 కోట్ల రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పింది.
అమరావతికి ఇప్పటికే రూ.6,700 కోట్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రుణం అందనుంది. ఏపీలో నిర్మించే రాజధానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర సర్కారు ప్రకటన చేసింది.
ఈ డబ్బును ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడీబీల ద్వారా ఇస్తామని చెప్పింది. వీటి ద్వారా మొత్తం రూ.13,500 కోట్లు సమకూర్చుతామని కేంద్ర సర్కారు పేర్కొంది. ఏపీ రాజధాని సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి తాము సపోర్ట్ చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది.
ప్రస్తుతం అమరావతిలో దాదాపు లక్ష మంది జీవిస్తున్నారని పేర్కొంది. వచ్చే పదేళ్లలో అక్కడ జనాభా అనేక రెట్లు పెరుగుతుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్కారు మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొంది.
అమరావతికి అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కూడా తామే అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందిస్తామని చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న 800 మిలియన్ల డాలర్ల రుణం ఆరేళ్ల గ్రేస్ పీరియడ్‌తో పాటు 29 ఏళ్ల మెచ్యూరిటీ ఉంటుందని పేర్కొంది. జపాన్ కరెన్సీ యెన్‌లో రుణం పొందేందుకు సర్కారు నిర్ణయించినట్లు వివరించింది.
KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్..