Shining AP: అమరావతి ఇక ఆగేదే లే.. టార్గెట్ ఫిక్స్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం..

ఏపీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కారు ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల స్వప్నాలను సాకారం చేస్తోంది.

Shining AP: అమరావతి ఇక ఆగేదే లే.. టార్గెట్ ఫిక్స్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం..

Updated On : June 12, 2025 / 10:14 AM IST

ఇక అన్నీ మంచి శకునములే ! ఆంధ్రుల కలల రాజధాని అమరావతి.. ఇక ఆగేదే లే. రాజధాని వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన చంద్రబాబు సర్కార్.. పనులను వేగవంతం చేసేందుకు రెడీ అయింది. టైమ్ టార్గెట్ పెట్టుకొని మరీ నిర్మాణాలు చేపట్టబోతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే.. రాజధానిని రెడీ చేయాలని ఫిక్స్ అయింది. ఇంతకీ రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు కాబోతోంది.. నిధులు ఎలా.. సర్కార్ చెప్తుందేంటి.. ఎదురుకాబోయే సవాళ్లేంటి..

అమరావతి.. ప్రాంతమే కాదు ఓ ఎమోషన్. నాలుగున్నర కోట్ల మంది కల. అలాంటి కల చుట్టూ భయాలు కనిపించాయ్ ఇన్నాళ్లు. గత ఐదేళ్లలో అమరావతి చుట్టూ చీకటి అలుముకుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే కూటమి సర్కార్.. రాజధాని నిర్మాణంపై స్పెషల్గా ఫోకస్ పెట్టింది. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నిధులను సమీకరించింది. మరోవైపు కేంద్రం కూడా సాయం ప్రకటించింది.

ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయలను రుణంగా సర్దుబాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో మరో 15వేల కోట్లు సమీకరించించది. వీటితో ముందుగా పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చూస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు సర్కార్.. ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే గతంలో ఇచ్చిన అనుమతులు, టెండర్లను సవరించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో అమరావతి నిర్మాణంపై క్రమంగా క్లారిటీ వస్తోంది.

Also Read: ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి.. వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

రాజధాని నిర్మాణ పనులను.. ఈ నెల 12 నుంచి 14 మధ్య ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ భేటీలో.. వివిధ సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై ఫోకస్ పెంచింది. ఐదేళ్లుగా అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగింది. దీంతో 35వేల ఎకరాల అమరావతి స్థలాల్లో.. నిర్వహణ లేక అడవిలా మారిపోయింది. దాదాపు 33 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి వచ్చింది.

అటు నిపుణుల సూచన మేరకు అదే నిర్మాణాలను కొనసాగించవచ్చనే క్లారిటీ వచ్చింది. దీంతో పాత టెండర్లను తిరిగి రివ్యూ చేస్తూ.. కొత్త వాటికి అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే మారిన అంచనాలతో.. అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 64వేల 721 కోట్లు అని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.

చాలా ప్రశ్నలు తెరమీదకు
నిజానికి నిధుల సమీకరణకు సంబంధించి చాలా ప్రశ్నలు తెరమీదకు వచ్చాయ్. ఐతే అమరావతికి ఖర్చు చేయబోయే నిధులపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. మల్టిపుల్ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా… నిధుల సేకరణ చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను దశలవారీగా మూడేళ్లలో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో పనుల్లో జాప్యం చేసిందని.. ఇక నుంచి పరుగులు పెట్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా నారాయణ ప్రకటన.. ఇప్పుడు అమరావతి రాజధానివాసుల్లో ఆనందం నింపుతోంది.

రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి 13వేల 400 కోట్ల రుణం ఇస్తున్నాయని.. KFW బ్యాంకు 5 వేలకోట్ల రుణం ఇస్తుందని.. హడ్కో నుంచి 11వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందని ప్రకటించారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో.. మిగతావి రెండేళ్లలో పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు అందించడంతో.. నిర్మాణ పనులు మొదలు కావడం ఇక లాంఛనమే. వాల్డ్బ్యాంక్ నుంచి ఇప్పటికే 15వేల కోట్ల రుణం మంజూరు కాగా.. అక్కడి నిర్మాణాలకు ఇది ఊతం ఇవ్వనుంది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 90పనులను చేపట్టనున్నారు. మొదటి దశలో 73పనులకు పరిపాలనపరమైన ఆమోదం లభించింది. దీంతో ముందుగా ఇవే పనులు మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీనికోసం 24వేల 274 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసింది.

సీఆర్డీఏ 43వ సమావేశంలో వీటికి ఆమోదం లభించింది కూడా! తొలి విడతలోనే అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులు మొదలు కావొచ్చు. మొత్తంగా 45వేల 249 కోట్ల పనులకు.. గతంలో సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. ఇందులో అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి వెయ్యి 48 కోట్లు, అయిదు ఐకానిక్ టవర్లకు 4వేల 665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ వివరించింది. రహదారుల టెండర్ల కోసం మరో 9వేల 699 కోట్లు, ఇతర రోడ్లకు 7వేల 794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని తెలుస్తోంది.

ఈ వారంలోనే దాదాపు 40 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయ్. అమరావతి నిర్మాణంలో భాగంగా.. నిధుల సమీకరణకు రుణం కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కోతో ఒప్పందం చేసుకున్నారు. రుణాల ద్వారా దశల వారీగా అమరావతి కోసం 31వేల కోట్లు రానున్నాయ్. నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సీఆర్డీఏ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాయ్. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా వీటి ఖరారు ఆలస్యం అయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో.. టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. ఏమైనా సరే.. ఎట్టి పరిస్థితుల్లో 2028నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ సర్కార్ పట్టిన పట్టు వీడడం లేదు.