Amaravati New Tirumala : భక్తులకు శుభవార్త.. అమరావతిలో మరో తిరుమల.. ఏడంతస్తుల మహారాజగోపురంతో శ్రీవారి వైభవం!
Amaravati New Tirumala : తిరుమల తిరుపతిని తలపించేలా అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం అవతరించబోతోంది. ఏడంతస్తుల రాజగోపారంతో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. పూర్తి వివరాలివే..
Amaravati New Tirumala
- తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం.. 2027 నాటికి దివ్యక్షేత్రం
- అమరావతిలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం
- శ్రీవారి మహిమతో అమరావతి.. ఏడంతస్తుల గోపురం ప్రత్యేక ఆకర్షణ!
- భారీ ఆలయ నిర్మాణం ఎక్కడివరకు వచ్చిందంటే?
Amaravati New Tirumala : ఏపీలో రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. తిరుమలలోని శ్రీవారి దివ్యక్షేత్రాన్ని తలపించేలా ఏడంతస్తుల మహారాజగోపురాలను నిర్మిస్తున్నారు.
ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ప్రకారమే తొలి దశలో రూ.140 కోట్లతో మహారాజగోపురం, రాజగోపురాలు, ప్రాకారాలు, మండపాల నిర్మాణాలను చేపట్టింది. 2027 డిసెంబరు నాటికి ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా ఏడంతస్తుల మహారాజగోపురం :
ప్రత్యేక ఆకర్షణ కోసం ఆలయ తూర్పు దిశలో 120 అడుగుల ఎత్తుతో ఏడంతస్తుల మహారాజగోపురాన్ని నిర్మించనున్నారు. అలాగే, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో కూడా ఐదంతస్తుల 3 రాజగోపురాలు నిర్మించనున్నారు. ఈ రాజగోపురాలతో మహారాజగోపురం ఆలయం మహోన్నతంగా వెలిగిపోనుంది.
రూ.140 కోట్ల తొలి దశ పనులు :
తొలి దశలో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టారు. ఇదివరకే సుమారు 15 శాతం పనులు పూర్తయ్యాయి. మహారాజగోపురం, ఇతర రాజగోపురాల నిర్మాణానికి రాయిని కూడా తమిళనాడులోని నామక్కల్ నుంచి తెప్పించారు. ప్రాకార నిర్మాణానికి రాయిని పల్నాడు జిల్లా కోటప్పకొండ సమీపంలోని కమ్మవారిపాలెం నుంచి తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Himanshu : కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్.. అసలేమైందంటే?
ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి, మండపాలు :
ప్రధాన దేవాలయం, ఆర్జిత సేవా మండపం, కల్యాణోత్సవ మండపం, వాహన మండపం, రథ మండపం, అద్దాల మండపాన్ని నిర్మిస్తున్నారు. మహారాజగోపురానికి ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. బాహ్య ప్రాకారం బయటవైపున స్వామివారి పుష్కరిణిని కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే, 40 అడుగుల వెడల్పుతో మాడ వీధులను రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
బ్రహ్మోత్సవాలకు భారీ కొయ్య రథం :
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఉత్సవమూర్తుల ఊరేగింపుల కోసం 30 అడుగుల ఎత్తు, 25 టన్నుల నుంచి 30 టన్నుల బరువుతో భారీ కొయ్య రథాన్ని నిర్మించనుంది. శ్రీనివాస మంగాపురం, తిరుచానూరులోని రథాల తరహాలో ఈ రథాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది.
మొదటి దశ పూర్తి అయ్యాక సుమారు రూ.150 కోట్లతో ఆడిటోరియం, అన్నప్రసాద కేంద్రం, తిరుమత తిరుపతి దేవస్థాన కార్యాలయం, భక్తుల విశ్రాంతి భవనం, అతిథిగృహం, కాటేజీలు, లడ్డూ విక్రయ కేంద్రం వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనుంది.
నిలిచిపోయిన పనులు వేగవంతం :
2019 ఏడాదికి ముందు టీడీపీ సర్కారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో ఈ దేవాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అభివృద్ధి పనులు, ఆలయ నిర్మాణాన్ని పరిమితం చేసింది.
కేవలం రూ.36 కోట్లతో ప్రధాన ఆలయం, ధ్వజస్తంభ మండపం, ఒకే రాజగోపురంతో అంతర ప్రాకార నిర్మాణాలను మాత్రమే పూర్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్లానింగ్ పునరుద్ధరించింది. అమరావతిలో తిరుమల తరహాలో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది.
