Unnam Hanumantharaya Chowdary: TDPలో తీవ్ర విషాదం.. మాజీ MLA ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతి
Unnam Hanumantharaya Chowdary : టీడీపీ కీలక నేత ఉన్నం హనుమంతరాయ చౌదరీ మృతి చెందారు.
anantapur former mla TDP Leader hanumantharaya chowdary passed away
Unnam Hanumantharaya Chowdary : టీడీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత అయిన ఉన్నం హనుమంతరాయ చౌదరి (80) మృతి చెందారు. ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. హనుమంతరాయ చౌదరి మృతితో జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
హనుమంతరాయ.. రాజకీయాల్లో చాలా కింది స్థాయి నుంచి పైకి ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి వార్డు సభ్యుడిగా, ఏకగ్రీవ సర్పంచ్‌గా ప్రారంభమై ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. సర్పంచ్‌గా చేసిన తర్వాత ఆయన మండల పార్టీ అధ్యక్షుడిగా, సింగిల్ విండో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. దానికి ముందు అంటే.. 2000 నుంచి 2010 వరకు దాదాపు పది సంవత్సరాల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998-2004 మధ్య కాలంలో ‘మార్క్‌ఫెడ్’ (MARKFED) చైర్మన్‌గా, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. హనుమంతరాయ చౌదరి గారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు యర్రంపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
