AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం.. అమరావతి అభివృద్ధి, పోలవరం పనులకు నిధులు
ఆంద్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ (AP Cabinet)లో 37 మొత్తం 37 కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది.
andhra pradesh cabinet 37 key decision on amaravati polavaram aviation and tourism department
- అమరావతి అభివృద్ధికి భారీగా నిధుల మంజూరు
- పోలవరం మిగిలిన పనులకు పరిపాలనా అనుమతి
- ఏపీ ఏవియేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి(AP Cabinet) సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మొత్తం 37 కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది. రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, పర్యాటకం, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించారు.
అమరావతి అభివృద్ధి, మౌలిక వసతులు:
రాజధాని పనులు: అమరావతి హైకోర్టు భవన సముదాయం చుట్టూ అంతర్గత రహదారులు, వాటర్ బాడీస్, ప్రీకాస్ట్ ఫిన్స్ నిర్మాణాల కోసం రూ. 547.07 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. కృష్ణా నది తీరాన 6 ఎకరాల్లో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టును పీపీపీ (DBFOT) పద్ధతిలో నిర్మించేందుకు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
క్వాంటం వ్యాలీ: రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ కోసం కేటాయించిన 49.66 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల నుండి వంద శాతం మినహాయింపు ఇచ్చింది. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాసాలలో అత్యాధునిక హోమ్ ఆటోమేషన్ వసతుల కోసం రూ. 94.90 కోట్ల ఎల్-1 బిడ్‌కు ఆమోదం తెలిపింది.
భూముల కేటాయింపు: ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణలపై చర్చించడంతో పాటు, వైజాగ్ మధురవాడలో స్టార్ హోటళ్లు, రిసార్టుల కోసం ఏపీటీడీసీకి 9.39 ఎకరాల భూమిని బదలాయించాలని నిర్ణయించింది.
పర్యాటకం, విమానయానం, రవాణా రంగం:
ఏవియేషన్ & బీచ్ షాక్స్: విమానయాన రంగాన్ని ఆధునీకరిస్తూ ‘ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31’ని తెచ్చారు. టూరిజం వృద్ధి కోసం విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ‘బీచ్ షాక్ ఎక్సైజ్ పాలసీ’ అమలు చేయనున్నారు.
పోర్టులు & ఫైబర్ నెట్: గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అనుసంధానానికి వీలుగా జాతీయ రహదారి-216 నుండి రోడ్డు, రైల్వే లైన్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డుకు భూములు ఇవ్వనున్నారు. అలాగే ఏపీ ఫైబర్‌నెట్ విస్తరణకు హడ్కో నుండి రూ. 300 కోట్ల అప్పు తీసుకునేందుకు వీలుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.
పోలవరం, ఉపాధి కల్పన, సామాజిక నిర్ణయాలు:
పోలవరం నిధులు: పోలవరం ఎడమ ప్రధాన కాలువ 5, 5A ప్యాకేజీలలో మిగిలిపోయిన పనులను వేగంగా పూర్తి చేయడానికి రూ. 796.66 కోట్ల సవరించిన నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
గ్రామీణ ఉపాధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (60:40) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచే ‘వికసిత్ భారత్ – రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ చట్టాన్ని ఈ ఏడాది జూలై 1 నుండి అమలు చేయనున్నారు.
ఆరోగ్యం, లీజులు: అవయవ మార్పిడి ప్రక్రియల్లో అవినీతికి తావులేకుండా పారదర్శకత కోసం ‘మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026’ కు ఆమోదం తెలిపారు. కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతం చేయడానికి అదనంగా 21 పోస్టులను మంజూరు చేశారు.
