ఏపీలో ఆ ప్రాంతాలు మళ్లీ లాక్ డౌన్‌లోకి..

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 12:10 PM IST
ఏపీలో ఆ ప్రాంతాలు మళ్లీ లాక్ డౌన్‌లోకి..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ ను చివరిదశ వరకూ ఎత్తేసింది. రెస్టారెంట్లు, బహిరంగ భారీ సమావేశాలు మినహాయించి అన్నింటికీ ఓకే చెప్పేశారు. కానీ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు వారి ప్రాంతం మేరకు లాక్ డౌన్ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు కావడంతో మరోసారి ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అనంతపురం, యాడికి, పామిడి, తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరోసారి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు‌, ఎస్పీ సత్య ఏసుబాబు వెల్లడించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆటోలు, క్యాబ్, ఇతర ప్రైవేటు వాహనాలను కూడా బంద్‌ కానున్నాయి. ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తాయని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల దాకా నిత్యవసర వస్తువుల కొనుగోళ్లకు ప్రజలకు అనుమతి ఇస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. 

పకడ్బంధీగా పలాస: ఇదిలా ఉంటే పలాస నియోజకవర్గంలోనూ కరోనాను అడ్డుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.  ఎమ్మెల్యే అప్పలరాజు పలాసలో కొత్త నిబంధనలు అమలు చేస్తామన్నారు. కొవిడ్‌-19 విజృంభిస్తుండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో చర్చించి ఏర్పాట్లు చేసేందుకు రెడీ అయ్యారు. 

లాక్‌డౌన్‌ను జూన్ 19 నుంచి వారం రోజులు ఉంటుంది. నిత్యావసరాలు, పెట్రోల్‌ బంకులు, వాహనాల రాకపోకలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.బంగారం, చెప్పులు, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, జీడి పరిశ్రమలు వంటి వాటికి నో పర్మిషన్. ప్రజలంతా సహకరిస్తేనే సాధించగలమని ఎమ్మెల్యే అప్పలరాజు కోరారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ మధుసూదన్‌ ధ్రువీకరించారు. పలాస-కాశీబుగ్గలోని రెండు ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

Read: ఏపీలో ఒకేరోజు 465 కరోనా కేసులు, నాలుగు మరణాలు