Anjanadri Hanuman : అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం

అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది.

Anjanadri Hanuman : అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం

Anjaneya

Updated On : July 31, 2021 / 6:17 PM IST

Anjanadri hanuman : అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రముఖులు పండితులంతా అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని అభిప్రాయపడ్డారు. దీనిపై విమర్శలు చేసిన వారిపై పండితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాల గురించి తెలియని వారికి ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదన్నారు.

పండిత పరిషత్ చైర్మన్ ఆచార్య మురళీధర్ శర్మ మాట్లాడుతూ అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని చేసిన తమ ప్రకటనను ఒకరిద్దరే వ్యతిరేకించారని తెలిపారు. మరింత మంది ప్రముఖుల అభిప్రాయం కోసం ఈ రంగంలో ప్రముఖులతో వెబినార్ నిర్వహించామని పేర్కొన్నారు. వెబినార్ లో పాల్గొన్న వారందరూ ముక్తకంఠంతో తిరుమలే హనుమంతుని జన్మస్థలంగా తేల్చారని వెల్లడించారు.

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి నాడు ఆంజనేయ జన్మస్థలంపై ప్రకటన చేసి, అభిప్రాయాలను ఆహ్వానించామని తెలిపారు. తిరుమలలోనే హనుమంతుడు పుట్టాడని తాము మూర్ఖంగా వాదించడం లేదన్నారు. ఇప్పుడు కూడా భిన్న ఆధారాలు ఉంటే తమకు చూపించ వచ్చని తెలిపారు.

వెంకటాచలం మహత్యం గురించి అనవసర వివాదాలు లేవనెత్త వద్దన్నారు. త్వరలో ఓ గ్రంధం విడుదల చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా దీనిపై వాదనకు రావచ్చు.. కానీ దూషించే ప్రయత్నం చేయవద్దన్నారు. సత్యాన్ని అసత్యం చేసే ప్రయత్నం చేయబోము… వితండవాదం చేయబోమని తెలిపారు. ఓ స్వామీజీ తమను దూషించడం తప్ప, ఆధారాలు చూపలేదన్నారు.