అన్న క్యాంటీన్ల ఆహార పట్టిక ఇదే.. ఏమేం పెడతారో తెలుసా? బ్రేక్‌ఫాస్ట్ కూడా..
అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే.

Anna Canteen food menu and timings
Anna canteen food menu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేద వారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టనున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను ఆయా నియోజవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేపు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఫుడ్ మెను, టైమ్ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటలకు ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలకు ఉంటుంది. డిన్నర్ రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆదివారం అన్న క్యాంటీన్లకు సెలవు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. భోజనంలో వైట్ రైస్ కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు వడిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది.
విశాఖపట్నం జిల్లాలో తప్పా..
మొదటి విడతలో 99 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని విశాఖ ఉమ్మడి జిల్లాలో వాయిదా వేశారు. విజయవాడ సిటీలో అత్యధికంగా 11 అన్న క్యాంటీన్లు పెడుతున్నారు. నెల్లూరు 7, గుంటూరు 7, కాకినాడ 5, ఏలూరు 4, రాజమండ్రిలో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు భారీగా విరాళాలు అందుతున్నాయి. భాష్యం విద్యాసంస్థలు, శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ కంపెనీ కోటి రూపాయల చొప్పున విరాళాలు అందించాయి.
Also Read: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కూటమి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది, వైసీపీ వ్యూహం ఫలించిందా?
అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే..
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం శుభ పరిణామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్(చిన్నీ) అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ”టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా 350 అన్న క్యాంటీన్లు నడిపాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతల భాగస్వామ్యంతో అన్న క్యాంటీన్లు ముందుకు వెళ్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ లాగానే అన్న క్యాంటీన్లు కూడా దాతల సహకారంతో నడుస్తాయి. చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయ”ని ఎంపీ కేశినేని తెలిపారు.