Cyclone Threat : ఏపీకి మరో తుఫాన్ గండం.. మిచాంగ్ బీభత్సం నుంచి కోలుకోకముందే!
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.

ap cyclone
Cyclone Threat for AP : ఏపీలో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మిచాంగ్ తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనం డిసెంబర్ 18న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
ఈ మేరకు సోమవారం వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 18కి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు పడవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. మిచాంగ్ తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో చేలు నీట మునిగాయి. తీవ్ర పంట నష్టం వాటిల్లింది. అపార ఆస్తి నష్టం జరిగింది. రహదారులు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో ఏపీకి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.