AP Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Weather Alert
AP Weather Alert: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 28వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో సైతం మంగళ, బుధవారాల్లో ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.