రాజధాని రైతుల పోరుబాట 12వ రోజు

రాజధానిలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వం, మంత్రులు, నేతలు ఎంత భరోసా ఇచ్చినా..రైతులు సమ్మతించడం లేదు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. తమకు న్యాయం చేయాలని రైతులు నినదిస్తున్నారు. ఇటీవలే కేబినెట్ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించారు. ఇప్పుడే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, హై పవర్ కమిటీ వేస్తున్నట్లు వెల్లడించింది. అయినా..కూడా ఎక్కడా కూడా ఆందోళనలు తక్కువ కావడం లేదు.
రాజధాని రైతుల పోరుబాట 12వ రోజు 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం కొనసాగుతోంది. మందడంలో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు, తుళ్లూరులో వంటా వార్పు, మహా ధర్నా చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి దాటాక పోలీసులు కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని రాజధాని రైతులు ఆరోపించారు.
అర్ధరాత్రి 3గంటల సమయంలో మా ఇళ్లలో తనిఖీలు చేశారని అన్నారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరుల్లో అక్రమ అరెస్టులు చేశారని రాజధాని రైతులు మండిపడ్డారు. తీసుకెళ్లిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పోలీసు స్టేషన్ల ముందే ధర్నాకు దిగుతామన్నారు. ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే పోలీసులు ఈ అక్రమ అరెస్టులు చేశారని రాజధాని రైతులు ఆరోపించారు.
Read More : మిడ్ మానేరు కోసం : కరీంనగర్‌కు సీఎం కేసీఆర్