రెడ్ బుక్ రగడ.. నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు, ఏం జరగనుంది?
ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

CID Noitces To Nara Lokesh For Red Book
రెడ్ బుక్ అంశంపై టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ తమను బెదిరిస్తున్నాడు అంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు సీఐడీ అధికారులు. లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. కోర్టు సూచనల మేరకు లోకేశ్ కు వాట్సాప్ లో నోటీసులు పంపింది సీఐడీ. నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీకి సమాధానం ఇచ్చారు లోకేశ్. ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
యువగళం పాదయాత్ర ముగింపు సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్ బుక్ ను చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ వేదికగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను సీఐడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వారు ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తు అధికారులను బెదిరించే విధంగా నారా లోకేశ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దర్యాఫ్తు అధికారులను బెదిరించిన వ్యవహారంలో నారా లోకేశ్ ను అరెస్ట్ చేయాలని హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు. రెడ్ బుక్ పేరుతో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారని కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో లోకేశ్ కు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Also Read : నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు..!
ఏసీబీ జడ్జి ఆదేశాలతో సీఐడీ అధికారులు వాట్సాప్ లో లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై లోకేశ్ మీడియాతో మాట్లాడారు. నేను ఎవరి పేర్లు చెప్పలేదు అన్నారు. ఎవరైతే ఇల్లీగల్ గా వ్యవహరిస్తున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడానన్నారు. నేను ఏ అధికారి పేరు కానీ, పోలీసు పేరు కానీ పెట్టి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కొంతమంది ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేస్తున్నారని, రేపు అధికారంలోకి వచ్చాక అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని మాత్రమే తాను చెప్పానని లోకేశ్ వివరించారు. డిపార్ట్ మెంట్ ను అక్రమ పద్ధతిలో వాడుకుంటున్న వారికి బుద్ధి చెబుతామని నేను చెప్పాను అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇప్పటికే అదే మాటకు మేము కట్టుబడి ఉన్నామన్నారు లోకేశ్. ఎవరైతే న్యాయంగా, చట్టబద్ధంగా పని చేస్తున్నారో వారి గురించి పట్టించుకోము అని స్పష్టం చేశారు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారో, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అధికార పార్టీకి అండగా నిలుస్తున్న అధికారులను మాత్రం వదలమన్నారు. సీఐడీలో కూడా ఒకరిద్దరు అధికారులు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారి గురించి మాత్రమే రెడ్ బుక్ అని నేను మాట్లాడటం జరిగిందన్నారు లోకేశ్. అసలు రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో వీరికి ఎలా తెలుసు? అని సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించారు నారా లోకేశ్.
Also Read : అన్నా రాంబాబు, మాగుంట మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణమేంటి?
నారా లోకేశ్ నోటీసులకు అఫిడవిట్ రూపంలో సీఐడీ అధికారులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానాన్ని సీఐడీ అధికారులు కోర్టుకు తెలియపరుస్తారని సమాచారం. మొత్తంగా నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.