AP CID notices : మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు…చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ల కిందే నారాయణపైనా కేసులు
మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు.

Cid Notices To Former Minister Narayana
CID notices to former minister Narayana : మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసుల్లో నారాయణను ఏ-2గా పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్ల కింద నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు హెచ్చరించారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్ 41ఏ(3)(4) కింద నారాయణను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు.
అమరావతి భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ప్రధాన అభియోగంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి అత్యంత ఖరీదైన భూములను గజం 15 వందలు, 2వేల రూపాయలకే విక్రయించారని, అలా విక్రయించిన భూముల్ని చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం రాజధాని భుముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదు. కానీ అక్కడ కొంతమందికి లబ్ధి కలిగేలా భూముల్ని అమ్మినట్లు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు.