ఏపీలో సిటీ బస్సులు: సింగిల్ సీటింగ్ పూర్తయ్యాకే రెండో సీటు

ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది.
ఈ క్రమంలో విజయవాడ, మండల, జిల్లా ప్రధాన నగరాలు కలిపేలా రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు చెప్పారు. మొత్తం రూ. 2900 కోట్లతో టెండరు ప్యాకేజీ పిలిచామన్నారు. 13 జిల్లాలకు టెండర్లు వచ్చాయన్నారు.
టెక్నికల్ గా పరిశీలించాక టెండరు ఖరారు చేస్తామని చెప్పారు. రూ.100 కోట్లపైన విలువ ఉన్న టెండర్లు జ్యూడీషియల్ పరిశీలనకు వెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీబీతో కలిసి టెండర్లు నిర్వహిస్తోందని కృష్ణబాబు తెలిపారు.
విజయవాడ, విశాఖలో ఇక నుంచి సిటీ బస్సులు తిరుగుతాయన్నారు. ఒక్కో బస్సులో సింగిల్ సీటింగ్ పూర్తయితే, రెండో సీటులో కూర్చోనిస్తామని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారికి సొంత పూచీపై ప్రయాణించే అవకాశం ఉందన్నారు. రూట్ల లెక్కలో సమతుల్యం విషయంలో ఒప్పుకున్నామని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ 71 రూట్లు తిప్పుతుంటే, టీఎస్ ఆర్టీసీ 23 రూట్లే తిప్పుతోందని కృష్ణ బాబు తెలిపారు.