CM Chandrababu: నాకు ‘మావిగన్’ అంటే ఏంటో తెలీదు.. గొడ్డలి పార్టీపై నమ్మకం పోయింది.. జగన్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పాల్గొన్నారు.
AP CM Chandrababu Naidu makes sensational comments about Jagan and Mavigun
- చంద్రబాబు ఘాటు రాజకీయ విమర్శలు.
- అమరావతి రాజధానిపై దండయాత్రలు.
- వెలిగొండ ప్రాజెక్టు పూర్తి హామీ.
CM Chandrababu: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసిన వైసీపీ, ఇప్పుడు ‘మావిగన్’ అనే కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అసలు ఆ పదం అర్థం తనకే కావడం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల విధ్వంసం.. అమరావతిపై దండయాత్ర:
గత ప్రభుత్వం మూడు రాజధానుల విధానంతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూసిందని సీఎం విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో తమ రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటే, ఏపీ ప్రజలు మాత్రం నవ్వుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అందుకే ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తుచేశారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇస్తే, అక్కడ పంటలకు నిప్పులు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్, ఇప్పుడు దానిపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించిన ఆయన, ఇకపై అదే పేరుతో పిలవాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రం.. మహిళల గౌరవానికి పెద్దపీట:
గత వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మారి యువత జీవితాలు నాశనమయ్యాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్మూలిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుమార్తెపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన భార్యను కూడా అవమానించారని గుర్తుచేస్తూ.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బటన్ నొక్కే నాయకుడిని కాదు.. వెలిగొండ పూర్తి చేస్తాం:
తాను కేవలం బటన్ నొక్కి ఇంట్లో కూర్చునే నాయకుడిని కాదని, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏటా రూ.33 వేల కోట్ల సామాజిక భద్రతా పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పూర్తి కాకుండానే దానికి ప్రారంభోత్సవాలు చేసిందని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విద్యుత్, పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని.. తాను, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
