CM Chandrababu: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆక్వా రైతుల సమస్యలను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు.
cm chandrababu naidu promises to resolve aqua farmers issues in west godavari
- ఆక్వా రైతులకు త్వరలోనే శుభవార్త.
- భూ రికార్డులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ.
- జగన్ పాస్ పుస్తకాలపై చంద్రబాబు ఫైర్.
CM Chandrababu: అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ మనుగడ కోసం పోరాడుతున్నారు. ఎగుమతులు భారం కావడంతో కుదేలైన ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం గతంలో పలుమార్లు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యలను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఇదే సభలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డులను గత పాలకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడాన్ని తప్పుబడుతూ, భూ రికార్డుల భద్రత కోసం తమ ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.
భూముల రక్షణ కోసం అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని, క్యూఆర్ కోడ్‌తో కూడిన అధికారిక రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని సీఎం వివరించారు. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్‌కు అస్సలు అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే 6,668 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, 26 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, నిషేధిత జాబితా (22ఏ) సమస్యలను కూడా వేగంగా పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
