పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న నివారణ చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలంతా కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే బీద వారికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
అనుమానితులను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్లో పెడుతున్నామని, తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ.2 వేల డబ్బు చేతిలో పెట్టాలని ఆయన చెప్పారు. వారు ఇంటికి వెళ్లాక పౌష్టికాహారం తీసుకోనేలా వారికి సూచనలు చేయాలని…లేదంటే.. మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుందని సీఎం జగన్ అన్నారు.
మనం ఇచ్చే డబ్బు ద్వారా పాలు, గుడ్డు, కూరగాయలు లాంటి పౌష్టికాహారాన్ని వారు తీసుకోవాలి. ఇలా చేయడం సమాజానికి కూడా మంచిది. అన్ని రోజులు క్వారంటైన్‌లో పెట్టి ఒకేసారి మనం ఇంటికి పంపితే.. వాళ్లు పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదని ఆయన చెప్పారు.
కాగా …రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాలలో మూడు చొప్పున కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 534 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 42, వైయస్సార్ కడప జిల్లాలో 36, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 10 మంది, కృష్ణా జిల్లాలో 4గురు, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.