Telangana Govt : సంక్రాంతి పండుగ వేళ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్పంచ్‌లకు తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
Telangana Govt : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రూ.277కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana government
Telangana Govt : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.277కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు భారీ ఊరట లభించినట్లయింది.
గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి పంచాయతీలకు నిధులను బదిలీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అవసరాలకోసం ఈ నిధులను వినియోగించుకునే అవకాశం పంచాయతీలకు లభించనుంది. పండుగ వేళ నిధుల విడుదల గ్రామాల్లో ఉత్సాహాన్ని పెంచిందని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.2,500 కోట్లు విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల చివరి నాటికి రూ. వెయ్యి కోట్లు, వచ్చే నెలలో మరో రూ. 1500 కోట్లు విడుదల చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవడానికి కేంద్రం కఠినమైన విధివిధానాలను నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇదిలాఉంటే.. సంక్రాంతి పండుగ వేళ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 277కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రంలోని పల్లెలు పండుగ వేళ కొత్త వెలుగులు సంతరించుకోనున్నాయి.
