కరోనా కట్టడి ఇలా చేస్తున్నాం – ఏపీ సీఎం జగన్

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 12:57 PM IST
కరోనా కట్టడి ఇలా చేస్తున్నాం – ఏపీ సీఎం జగన్

Updated On : April 2, 2020 / 12:57 PM IST

ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొని వివరించారు. 

విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో 2012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పామన్నారు. 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ – 19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించామన్నారు. 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశామని, మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధం చేశామని వెల్లడించారు. దీనికి తోడు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20 వేల బెడ్లను రెడీగా ఉంచినట్లు, క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు. 

* ఫిబ్రవరి 10, 2020 నుంచి ఇప్పటి వరకు 27,876 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు.
* వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మంది.
 

* 17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు. 
* వీరిని  కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారు. 
 

* వీరందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు. 
* కోవిడ్‌ –19 లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వేలు. 

ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించడం జరిగిందన్నారు. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారాయన. రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ – 19 సోకిందని చెప్పిన సీఎం జగన్..ఇందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారన్నారు. 

91 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడం ద్వారా ఈ వైరస్‌ సోకిందన్నారు. క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీని పాటించడం జరుగుతోందని, వైద్య పరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తిస్థాయిలో మోహరిస్తున్నామన్నారు. కానీ..మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు రకాల చర్యలను తీసుకుందన్నారు. 

పేద కుటుంబాలను ఆదుకోవడానికి అనేక చర్యలను తీసుకుందని వివరించారు. మార్చి 29 నుంచే ఏప్రిల్‌ నెలకు ఇవ్వాల్సిన రేషన్‌ ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, కేజీ కందిపప్పును ఉచితంగా ఇచ్చామన్నారు. ఒకే నెలలో మొత్తం 3 సార్లు రేషన్, కందిపప్పును ఉచితంగా పేద కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. పేద కుటుంబాలను ఆదుకోవడానికి, నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి కుటుంబానికి రూ. 1000లు కూడా ఏప్రిల్‌ 4వ తేదీన ఇవ్వబోతున్నామని చెప్పారు. 

* రైతు బజార్ల వికేంద్రీకరణ. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా వాటిపై ప్రత్యేక కమిటీల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. 
* ప్రతి మార్కెట్‌ దుకాణాల వద్ద ధరల పట్టిక. 
 

* రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9,695 మంది కోసం 218 సహాయ పునరావాస శిబిరాలు. 
* ఇందులో ఏపీకి చెందిన వారు 3,819 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 5,876 మంది.
 

* ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ నెలలో ఇవ్వాల్సిన జీతాల్లో 50 శాతం వాయిదా.
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది.
* దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మంత్రిగారిని కోరుతున్నా. 

ఈ కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.