ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు, ఆ 3 జిల్లాల్లో పరిస్థితి భయానకం

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 02:18 PM IST
ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు, ఆ 3 జిల్లాల్లో పరిస్థితి భయానకం

Updated On : July 2, 2020 / 3:26 PM IST

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 812 కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 29మందికి కరోనా నిర్దారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 281 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 16వేల 97కి పెరిగింది. మరణాల సంఖ్య 198కి చేరింది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 8వేల 586. కోలుకున్న వారి సంఖ్య 7వేల 313.

అనంతను వణికిస్తున్న కరోనా:
అనంతపురం జిల్లాలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ 21వ తేదీ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడం కలవర పెడుతోంది. గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లాలో ఏకంగా దాదాపుగా 100 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన 845 కేసుల్లో.. అనంతపురం(134), గుంటూరు(104), కడప జిల్లాల్లోనే(101) వందకుపైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు(2120) టాప్ లో ఉంది. ఆ తర్వాత అనంతపురం జిల్లా(1823), గుంటూరు జిల్లా(1530) ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం కలవర పెడుతోంది. కాగా, టెస్టుల సంఖ్య పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు:
ఇది ఇలా ఉంటే ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 9 లక్షల మార్కును దాటింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చెయ్యని విధంగా జగన్ ప్రభుత్వం ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.

 

Read:ఏపీకి వెళ్లే వారికి ముఖ్య గమనిక, ఈ-పాస్ ఉంటేనే అనుమతి