Rajanna Dora : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదంపై కేంద్రమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అవివేకం అనిపించుకుంటుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశానికి మంత్రని, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలన్నారు.

Rajanna Dora
Rajanna Dora : కొటియా గ్రామాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొటియా గ్రామాలు ఒడిశావే అంటూ పేర్కొన్నారు. ఏపీ అధికారులు గో బ్యాక్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాదాస్పద కొటియా గ్రామాలపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో ఉండి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదంపై కేంద్రమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అవివేకం అనిపించుకుంటుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశానికి మంత్రని, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలన్నారు. కేవలం ఒడిశాపై ప్రేమ చూపిస్తూ.. ఆంధ్ర గో బ్యాక్ అనడం విచారకరమన్నారు. వెంటనే కేంద్రమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొటియా గ్రామాల్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కొటియా గ్రామాలపై ధర్మేంద్రప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొటియా గ్రామాలు ఒడిశావేనని ఆయన స్పష్టం చేశారు. ధర్మేంద్రప్రధాన్ ను కొటియా సీఐ రోహిణి పాత్రో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆంధ్ర పోలీసులకు ఇక్కడేం పని..గో బ్యాక్ ఆంధ్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో కొటియాలో వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ వచ్చారు. బీజేపీ కార్యకర్తలతోపాటు ఆయన పలు గ్రామాలను సందర్శించారు. ఆంధ్రకు చెందిన కొటియా సీఐ రోహిణి పాత్రో పోలీసు బలగాలతో ధర్మేంద్రప్రధాన్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు అక్కడికి వెళ్లారు.
ఉన్నట్టుండి ధర్మేంద్రప్రధాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్ర పోలీసులకు ఇక్కడేం పని.. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటూ తీవ్ర పదజాలంతో స్పందించారు. ఈ కొటియా గ్రామాలన్నీ ఒడిశా పరిధిలోకి వస్తాయని, ఇవి ఒడిశా గ్రామాలని ఆయనపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. దీంతో సీఐ రోహిణి పాత్రలో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ప్రస్తుతం ధర్మేంద్రప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కొటియాలో గ్రామాలు 21 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటాయి. అయితే ఈ గ్రామాలు ఇటు ఆంధ్రావా? అటు ఒడిశావా? అనే వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొటియా గ్రామాల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో కేంద్రమంత్రి పదవిలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కొటియా గ్రామాలు ఒడిశావే అని చెప్పడం కలకలం రేపుతోంది. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అగ్గి రాజేసినట్లైంది.