AP EAPCET Results 2026 : విద్యార్థులకు అలర్ట్.. 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
AP EAPCET Results 2026 : ఏపీలోని విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30న ఏపీఈఏపీసెట్ -2026 ఫలితాలు విడుదల కానున్నాయి.
AP EAPCET Results 2026
AP EAPCET Results 2026 : లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 30వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈఏపీ సెట్ చైర్మన్ , జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ ఫలితాలను మంగళవారం ఉదయం 11గంటలకు మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విడుదల చేసే అవకాశం ఉంది.
మే 12 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా.. 3.29లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నాటికి ఏపీఈఏపీ సెట్-2026 ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఉండడంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఆగాల్సి రావడంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ + ఎప్సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఆధారంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులను కేటాయిస్తారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు cets.apsche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ఫలితాల విడుదల తరువాత జులై మొదటి వారంలో లేదంటే రెండో వారంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ఫ్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
