AP Health Department: వైద్యులపై సర్కార్ వేటు.. ఏకంగా 193 మందిపై చర్యలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
విధులలో అలసత్వం వహిస్తున్న 193 మంది వైద్యులపై(AP Health Department) కీలక చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
AP government dismissed 70 doctors for being absent from duty
AP Health Department: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో క్రమశిక్షణారాహిత్యం, సుదీర్ఘకాల అనధికారిక గైర్హాజరీపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విధులకు తరచూ గైర్హాజరవుతూ రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న 70 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్య రక్షణకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రమూ సహించేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది.
మరో 193 మందిపై చర్యలకు ఆదేశాలు.. మే నెలలోనే 51 మంది తొలగింపు:
కేవలం ఈ 70 మందితోనే కాకుండా, వివిధ దశల్లో గైర్హాజరవుతున్న మరొక 193 మంది వైద్యులపై(AP Health Department) కూడా తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గతంలో మే నెలలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 51 మంది వైద్యులను విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకుగాను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం విధితమే.
మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం.. శాఖాపరమైన నివేదికల ఆధారంగా చర్యలు:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల గైర్హాజరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. డీఎంఈ, డీఎస్హెచ్ఎస్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదికలను పరిశీలించిన అనంతరం, సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్న వైద్యులపై ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
