జనవరి 1 నుంచి 500 సేవలు…ఆరోగ్యశ్రీ కార్డులు : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 02:53 AM IST
జనవరి 1 నుంచి 500 సేవలు…ఆరోగ్యశ్రీ కార్డులు : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Updated On : December 27, 2019 / 2:53 AM IST

ఏపీలో ప్రజల ఇంటికే పలు సేవలు అందించేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త పాలన స్టార్ట్ కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. 500 రకాల సేవలతో పాటు జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను నిర్ణీత గడువులోగా అందించనున్నారు. ఇందుకు అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్‌ సౌకర్యంతోపాటు స్మార్ట్‌ ఫోన్లు, ల్యామినేషన్‌ యంత్రాలు, సిమ్‌ కార్డులు, ఫింగర్‌ ప్రింటింగ్‌ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే 80 శాతానికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ పనులు పూర్తయ్యాయి.

50 శాతానికిపైగా కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. డిసెంబర్‌ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలు కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పాలనా వ్యహారాలను కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను మూడు రకాలుగా విభజించారు. కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే స్పాట్ లోనే అందిస్తారు. ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తర్వాత అందిస్తారు. ఉదాహరణకు.. రైతు తన పొలానికి సంబంధించి అడంగల్‌ కోసం గ్రామ సచివాలయానికి వస్తే అక్కడికక్కడే ప్రింట్‌ తీసి ఇచ్చేస్తారు. ఇదంతా పావు గంటలోనే పూర్తవుతుంది. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే పావు గంటలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తం 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు. ఈ 311 రకాల సేవలను 72 గంటల కంటే ఇంకా తక్కువ వ్యవధిలోనే అందించేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను సీఎం డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. ప్రజలకు అందించాల్సిన సేవలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.

వైఎస్ఆర్ నవశకం పేరుతో నవరత్నాల పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను ఇంటింటి సర్వే ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లు ఎంపిక చేశారు. ఆర్యోగశ్రీ పథకం లబ్ధిదారులను ఇప్పటికే పూర్తిస్థాయిలో గుర్తించారు. సామాజిక తనిఖీ నిమిత్తం లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. శుక్రవారం లబ్ధిదారుల తుది జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదిస్తారు. ఇప్పటివరకు దాదాపు 1,43,04,823 కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత కలిగి ఉన్నట్లు తేల్చారు. లబ్ధిదారులకు జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు.