AP Local Body Polls : ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ.. ఈసీ ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు గడువుతో టెన్షన్..!
AP Local Body Polls : ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, వైసీపీ ఫిర్యాదులు, అభ్యర్థుల జాబితా ప్రకటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోనున్న కీలక నిర్ణయంపై పూర్తి వివరాలివే..
AP Local Body Polls
- ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ..
- సుప్రీంకోర్టు గడువుతో టెన్షన్..
- ఏపీ ఎన్నికల సంఘం ఏం చేయబోతోంది?
- అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠకు తెరపడేనా?
AP Local Body Polls : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఎలాంటి స్పష్టత ఇస్తుంది? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసీ కసరత్తు :
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారితోనూ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన గడువులు, తదుపరి తేదీలపై సమాలోచనలు నిర్వహించారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇతర ఎన్నికల షెడ్యూల్‌కు ఆటంకం కలగకుండా నిర్ణయాలు తీసుకోవడంపై కూడా కసరత్తు చేసినట్లు సమాచారం..
వైసీపీ ఫిర్యాదులతో కీలక మలుపు :
మరోవైపు, పలుచోట్ల తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఫిర్యాదులపై గురువారమే నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
అందరి చూపు ఈసీ నిర్ణయంపైనే :
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసీ ప్రకటించనున్న నిర్ణయం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తదుపరి ప్రక్రియకు కీలకంగా మారనుంది. ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అభ్యర్థుల జాబితా ప్రకటనకు సంబంధించి ఏం చెబుతారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈసీ నిర్ణయం వెలువడిన తర్వాతే ఎన్నికల తదుపరి కార్యాచరణపై మరింత స్పష్టత రానుంది.
