Horizontal Reservation: అసలు ఏంటీ జీవో 77.. హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా జరుగుతుంది.. మెగా డీఎస్సీ అభ్యర్థులకు లాభమా నష్టమా?
ఈ సమాంతర సర్దుబాటు(Horizontal Reservation) ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారడం వల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ap mega dsc horizontal reservation confusion and go 77 roster points issue
- మెగా డీఎస్సీ రిజర్వేషన్ల గందరగోళం.
- హారిజాంటల్ విధానంతో అభ్యర్థుల నష్టం.
- ముందే రోస్టర్ పాయింట్లు లేవు.
Horizontal Reservation: సాధారణంగా ఉద్యోగాల భర్తీలో రెండు రకాల రిజర్వేషన్లు ఉంటాయి. మొదటిది వర్టికల్ (సామాజిక) రిజర్వేషన్. ఇది ఎస్సీ (15%), ఎస్టీ (6%), బీసీ (29%), ఈడబ్ల్యూఎస్ (10%) వర్గాలకు వర్తిస్తుంది. వీటికి ముందుగానే స్థిరమైన రోస్టర్ పాయింట్లు ఉంటాయి కాబట్టి ఎలాంటి గందరగోళం ఉండదు. రెండవది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమల్లోకి వచ్చిన హారిజాంటల్ (సమాంతర) రిజర్వేషన్. ఇది మహిళలు (33.3%), దివ్యాంగులు (4%), క్రీడాకారులు (3%), మాజీ సైనికోద్యోగులకు (2%) కేటాయించిన కోటా.
గత ప్రభుత్వం 2023 ఆగస్టు 2న తెచ్చిన జీవో 77 ప్రకారం ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ పద్ధతిలో వీరికి ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు ఉండవు. అభ్యర్థులు తమ స్వంత మెరిట్‌తో జనరల్ లేదా సామాజిక కోటాలో నిర్దేశిత సంఖ్యలో ఎంపికైతే ప్రత్యేకంగా రిజర్వేషన్ వర్తింపజేయరు. ఒకవేళ ఆ సంఖ్య తగ్గితేనే, చివర్లో ఉన్న మెరిట్ అభ్యర్థులను తొలగించి వీరిని సర్దుబాటు చేస్తారు.
అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారు?
ఈ సమాంతర సర్దుబాటు(Horizontal Reservation) ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారడం వల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉదాహరణకు ఒక సబ్జెక్టులో 100 పోస్టులు ఉండి, అందులో 4 దివ్యాంగుల (PH) పోస్టులు భర్తీ కావాల్సి ఉందనుకుందాం. మెరిట్ లిస్ట్‌లో ముగ్గురే ఎంపికవడంతో, 4వ పోస్టు కోసం 400వ ర్యాంకులో ఉన్న ఒక బీసీ-బీ దివ్యాంగుడిని జాబితాలోకి తెచ్చి, అప్పటికే 99వ స్థానంలో ఉన్న సాధారణ బీసీ-బీ అభ్యర్థిని తొలగించారు.
కానీ, ఆ దివ్యాంగుడి సర్టిఫికెట్ అనర్హమైనదిగా తేలడంతో, అతని స్థానంలో 450వ ర్యాంకులో ఉన్న ఎస్సీ-3 దివ్యాంగుడిని ఎంపిక చేశారు. ఇతను ఎస్సీ కేటగిరీ కాబట్టి, ఇందాక తొలగించిన బీసీ-బీ అభ్యర్థిని మళ్లీ వెనక్కి తెచ్చి, 97వ స్థానంలో ఉన్న సాధారణ ఎస్సీ-3 అభ్యర్థికి ఉద్యోగం నిరాకరించారు. దీనివల్ల అప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన సాధారణ అభ్యర్థి చివరి నిమిషంలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
మల్టిపుల్ పోస్టులు.. సర్టిఫికెట్ల పరిశీలన గందరగోళం:
మరోవైపు ఒకే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ (SA), పీజీటీ (PGT) వంటి రెండు వేర్వేరు పోస్టులకు ఎంపికైనప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. సదరు అభ్యర్థి పీజీటీ పోస్టును ఎంచుకుంటాడనే అంచనాతో, అధికారులు స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని 1:1 నిష్పత్తి కంటే అదనంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచారు. అయితే, మొదటి అభ్యర్థికి పీజీటీకి అవసరమైన అర్హత పత్రాలు సరిగ్గా లేకపోవడంతో అతను స్కూల్ అసిస్టెంట్ పోస్టులోనే ఉండిపోయాడు.
దీనివల్ల ఉద్యోగం వస్తుందనే ఆశతో వెరిఫికేషన్‌కు వెళ్లిన రెండవ అభ్యర్థి చివరకు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఇలా మహిళల కోటా ప్రతి అంతర్గత కేటగిరీలో విడివిడిగా అమలు అవుతుండగా, క్రీడా, పీహెచ్ కోటాలను మొత్తం 100 పోస్టులను ఒకే యూనిట్‌గా లెక్కిస్తుండటంతో నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఏ సామాజిక కోటా కింద ఎంపికవుతారో తెలియని అయోమయం నెలకొంది.
