AP MLC Election: ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

Ap Mlc Election Ycp Mlc Candidates Final
AP MLC Election: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను బుధవారం (నవంబర్ 10)వ తేదీన వైసీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి పేర్లను వైసీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు కాపు సామాజిక వర్గమైన పాలవలస శ్రీకాంత్, కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి మైనార్టీ ఇషాక్ బాషా, కడప జిల్లాలోని బద్వేల్ నుంచి రెడ్డి సామాజిక వర్గంలో డీసీ గోవింద రెడ్డి పేర్లను సజ్జల ప్రకటించారు.
ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని సజ్జల అన్నారు. పీఆర్సీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే సీఎం జగన్‌తో సీఎస్ సమావేశమయ్యారని, నెలాఖరుకి పీఆర్సీ నివేదిక విడుదల అవుతుందని సజ్జల వెల్లడించారు.
మరోవైపు.. ఏపీలోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది.. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేయనుంది. అదేరోజు నుంచి నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 23 కాగా.. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26 చివరి తేదీగా ప్రకటించింది. డిసెంబర్ 10న పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుందని ఈసీ ప్రకటించింది.
Read Also : 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 3 రోజులే..