AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ 11 జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
AP Rain Alert
- ఏపీకి రెయిన్ అలర్ట్
- ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
AP Rain Alert : ఎల్నినో ప్రభావంతో ఏపీలో జూన్, జులై మాసంలో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. దీంతో రైతులు సాగు పనుల్లో ముందుకెళ్లలేక భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఐదు రోజులుపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ముఖ్యంగా 11 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇక సోమవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లొద్దని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వచ్చినా తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున చిన్నబోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
