జల జగడం.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి తెరపడేనా?

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 12:08 PM IST
జల జగడం.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి తెరపడేనా?

Updated On : October 6, 2020 / 12:39 PM IST

apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాడో – పేడో తేల్చుకునేందుకే ఇద్దరు సీఎంలు సిద్ధమయ్యారు. నీటి పంపకాల విషయంలో రాజీ పడేది లేదని గట్టిగా చెబుతున్నారు.




తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి తెరపడుతుందా..? కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందా…? లేక ప్రేక్షక పాత్రకే పరమితమవుతుందా.. మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది. నీటి పంపకాలతో గట్టిగా వాదనలు వినిపించాలని ఏపీ, తెలంగాణ సీఎంలు డిసైడ్ అయ్యారు. నీటి పంపకాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. ఢీ అంటే ఢీ అనేట్లుగా సాగే అవకాశం కనిపిస్తోంది.

నీటి విషయంలో రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో వివరిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ వాటాగా వచ్చే నీటిని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమ కట్టడం కాదన్నారు. నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదని సజ్జల అన్నారు.