AP Global Investors Summit 2023: ఏపీకి భారీగా పెట్టుబడులు.. రూ.11.5 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు… Live Blog

‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.

AP Global Investors Summit 2023: ఏపీకి భారీగా పెట్టుబడులు.. రూ.11.5 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు… Live Blog

Updated On : March 3, 2023 / 8:51 PM IST

AP Global Investors Summit 2023: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రకటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు అనేక కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు.

 

 

 

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 Mar 2023 07:32 PM (IST)

    రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు

    విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది విజయవంతమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని ట్వీట్ చేశారు.

  • 03 Mar 2023 05:36 PM (IST)

    రూ.6,300 కోట్లతో వైజాగ్ పోర్టు 6 లైన్ల రహదారి నిర్మాణం: సోము వీర్రాజు

    ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు వేదికగా రూ.6,300 కోట్ల వ్యయంతో వైజాగ్ పోర్టు 6 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని ఆయన ట్వీట్ చేశారు.

  • 03 Mar 2023 05:04 PM (IST)

    ప్రముఖుల స్పందన

  • 03 Mar 2023 04:58 PM (IST)

    మా కార్యక్రమాలకు పూర్తి సహకారం లభిస్తోంది: ప్రీతారెడ్డి

    ఏపీలో అపోలో కార్యక్రమాలకు పూర్తి సహకారం లభిస్తోందని ఆ ఆసుపత్రుల వైస్ ఛైర్ పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కారు కృషి అభినందనీయమని చెప్పారు. ఏపీ సర్కారుతో తాము భాగస్వామిగా ఉండడం సంతోషకరమని తెలిపారు. ఆరోగ్య శ్రీ మంచి పథకమని, ఇతర దేశాలకు కూడా విస్తరించిందని, ఆఫ్రికా దేశాల్లో ఇటువంటి పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు.

  • 03 Mar 2023 03:34 PM (IST)

    తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన ముకేష్ అంబానీ

    mukeshజీఐఎస్-2023లో పాల్గొన్న ముకేష్ అంబానీ నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ఏపీ గురించి ఆయన ప్రస్తావించారు. కృష్ణా, గోదావరి నదులు, తిరుమల వెంకటేశ్వర స్వామి, రాష్ట్ర సహజ వనరుల గురించి మాట్లాడారు. అలాగే తన రిలయన్స్ సంస్థలో ఏపీకి చెందిన పలువురు మేనేజర్లు ఉన్నారని కితాబిచ్చారు. జియో 5జీ సర్వీసులు ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయన్నారు. 1.5 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఏపీ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుని ముందుకు వెళ్తుందన్నారు.

  • 03 Mar 2023 03:21 PM (IST)

    భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాం: నవీన్ జిందాల్

    భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూడొచ్చన్నారు వ్యాపారవేత్త నవీన్ జిందాల్. ‘‘అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో మాకు ఉన్న సానుకూల అనుభవాన్ని పంచుకునేందుకు మేము సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాం. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, భారీ తయారీ స్థావరం, ప్రతిభావంతులైన యువత, అద్భుత వ్యాపార అనుకూల వాతావరణం వంటివి ఏపీకి కలిసొచ్చే అంశాలు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు" అని నవీన్ జిందాల్ అన్నారు.

  • 03 Mar 2023 02:57 PM (IST)

    ఏపీలో రోడ్ కనెక్టివిటీకి రూ.20 వేల కోట్లు కేటాయింపు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    ‘జీఐఎస్-2023’లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఈ మేరకు ఏపీకి పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి రహదారుల అనుసంధానం చాలా ముఖ్యం. పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తాం. పరిశ్రమల అభివృద్ధికి రవాణా ఖర్చు తగ్గించడం చాలా అవసరం. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఏపీలో రహదారుల అనుసంధానానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

  • 03 Mar 2023 01:12 PM (IST)

    త్వరలో విశాఖ నుంచే పాలన సాగిస్తాం: సీఎం జగన్

    విశాఖపట్నం రాజధాని అంశంపై జీఐఎస్ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖపట్నం ఏపీకి పాలనా రాజధాని కాబోతుందని ప్రకటించారు. ‘‘త్వరలో విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. నేను కూడా త్వరలో విశాఖకు మారుతున్నా’’ అని ప్రకటించారు. విశాఖపట్నం ఎకానమీ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమైన జీ20 సదస్సుకు కూడా విశాఖ వేదికగా మారిందన్నారు.

  • 03 Mar 2023 01:06 PM (IST)

    ఏపీలో పెట్టుబడులకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి: సీఎం జగన్

    ఏపీలో పెట్టుబడుల కోసం అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. పెట్టుబడులకు ఆకర్షణీయ స్థలం విశాఖ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 340 ఇన్వెస్టర్స్ వచ్చారు. ఏపీలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఇదే. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తొలి రోజు 92 ఎంవోయూలు కుదిరాయి. సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా, 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఏపీలో 26 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలున్నాయి. ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతం. ఇది దేశంలోనే ఎక్కువ. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది.

  • 03 Mar 2023 12:14 PM (IST)

    అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం: మంత్రి బుగ్గన

    ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. ‘‘ఏపీలో సహజ వనరులు అధికంగా ఉన్నాయి. మానవ వనరులకు కొదువ లేదు. ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలకు ఏపీలో మంచి అవకాశాలున్నాయి. దేశ పారిశ్రామిక రంగంలో ఏపీ ముందంజలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలపై సీఎం మంచి విజన్‌తో ఉన్నారు’’ అని బుగ్గన వ్యాఖ్యానించారు.

  • 03 Mar 2023 12:09 PM (IST)

    ఏపీలో శ్రీ సిమెంట్ కంపెనీ పెట్టుబడులు

    ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుడులు పెడుతున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ ప్రకటించింది. సంస్థ ఛైర్మన్ హరి మోహన్ దీనిపై ప్రకటన చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు ఐదు వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.

  • 03 Mar 2023 12:09 PM (IST)

    జీఐఎస్‌కు హాజరైన ప్రముఖ అతిథులు వీళ్లే

    జీఐఎస్-2023కి రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్ర శేఖరన్, జీఎంఆర్ గ్రూప్ అధినేత మల్లికార్జున రావు, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర, సెయంట్ అధినేత మోహన్ రెడ్డి, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ, నవీన్ జిందాల్ తదితరులు హాజరయ్యారు.

  • 03 Mar 2023 12:02 PM (IST)

    ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు

    ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.10 వేల కోట్ల పెట్టుబడుల్ని ప్రకటించారు నవీన్ జిందాల్. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో 10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.

  • 03 Mar 2023 11:25 AM (IST)

    రాష్ట్రంలో పరిశ్రమలకు పుష్కల అవకాశాలు: మంత్రి గుడివాడ

    ఆంధ్ర ప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి పుష్కల అవకాశాలున్నాయన్నారు ఏపీ పారిశ్రామిక మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ పాలన సాగుతోందని గుడివాడ చెప్పారు.

  • 03 Mar 2023 11:21 AM (IST)

    జీఐఎస్ ప్రారంభించిన సీఎం జగన్

    జీఐఎస్-2023ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీసహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

  • 03 Mar 2023 10:34 AM (IST)

    ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)కు ముకేష్ అంబానీ

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ జీఐఎస్‌కు హాజరయ్యారు. ఆయనకు ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి విడుదల రజినీ స్వాగతం పలికారు. ఆయన జగన్‌తో కలిసి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.