విశాఖ వైసీపీలో గురుశిష్యుల సైలెంట్ వార్, టీడీపీపై వేర్వేరుగా విరుచుకుపడటం వెనుక మాస్టర్ ప్లాన్

avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్‌నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్‌నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమర్‌నాథ్ 2007లో టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక విద్యా సంస్థల అధిపతిగా ఉన్న అవంతి శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఈ గురుశిష్యులు ఇద్దరూ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.
ప్రత్యర్థిపై విమర్శలు చేయడానికి గురుశిష్యుల పోటీ వెనుక కారణం:
ప్రతిపక్ష పార్టీపై అవంతి, అమర్‌నాథ్ ఒంటికాలి మీద లేస్తున్నారు. సబ్జెక్ట్ దొరికితే చాలు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఒకే విషయంపై టీడీపీని ఇరుకున పెట్టేలా ఒకరు మీడియా సమావేశం నిర్వహిస్తే, సాయంత్రం అదే విషయంపై మరొకరు మరో వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఒకే విషయంపై పూటకోసారి ఇటు మంత్రి అవంతి, అటు ఎమ్మెల్యే అమర్‌నాథ్ సమావేశాలు పెడుతున్నారు. ప్రత్యర్థిపై విమర్శలు చేయడానికి పోటీ పడటంలో వింతేముంది అనుకుంటున్నారు కదా. కానీ అక్కడే ఉంది అసలు కిటుకు.
విశాఖ జిల్లాలో 11 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడటానికి మిగిలిన వారి కంటే ఈ ఇద్దరే పోటీ పడటం వెనుక అసలు గుట్టు దాగి ఉందంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అమర్‌నాథ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్ధిగా టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు. అప్పట్లో గురుశిష్యుల మధ్య పోరుగా వార్తల్లోకి ఎక్కింది.
గురుశిష్యుల మధ్య బంధానికి బీటలు:
అమర్ వైసీపీ జిల్లా సమన్వయకర్తగా ఉంటూ టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. కానీ, గురువుగా ఉన్న అవంతి విషయంలో పల్తెత్తు మాట ఏనాడూ అనలేదు. ఎందుకంటే అప్పట్లో రాజకీయాలు ఎలా ఉన్నా సరే గురుశిష్యుల మధ్య పొలిటికల్ బంధం స్ట్రాంగ్‌గా ఉండేది. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటంతో గురుశిష్యులకు ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. నిజానికి ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటే రాజకీయంగా ఇబ్బంది లేకపోయినా, పరస్పరం సహకరించుకునే చాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలోకి వచ్చిన తర్వాత గురుశిష్యుల మధ్య బంధానికి బీటలు వారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ కారణంతో ఆవంతికి మంత్రి పదవి:
2019 ఎన్నికలకు వచ్చే సరికి అవంతి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గురుశిష్యులు ఇద్దరూ ఒకే గూటి పక్షులయ్యారు. వైసీపీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా అవంతి గెలుపొందగా, అనకాపల్లి ఎమ్మెల్యేగా అమర్ గెలిచారు. ఈ ఇద్దరి పేర్లు మంత్రివర్గం కూర్పు సమయంలో తెగ చర్చకు వచ్చాయి. అయితే ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, విశాఖ నగరాన్ని ఆనుకొని భీమిలి ఉండటం, పార్టీ మార్పు సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ బెర్త్ అవంతినే వరించింది.
ఒకే సబ్జెక్ట్‌పై గంటల వ్యవధిలో ఇద్దరూ మీడియా ముందుకు:
అమర్‌కు సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ జిల్లాలో టీడీపీని ఓ ఆట ఆడుకున్నది అమర్‌నాథే. అయితే అమర్ ఇంకా యువకుడు కావడం, పార్టీలో చేరేముందు అవంతికి ఇచ్చిన మాట కారణంగా అమర్‌కు మంత్రి పదవి దూరమైందంటున్నారు. దీంతో అవంతి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ఇద్దరూ ఇటీవల ప్రతిపక్షాలపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. ఇద్దరూ ఒకే సబ్జెక్ట్‌పై గంటల వ్యవధిలో మీడియా ముందుకు వస్తుండటం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
సబ్బంహరి నుంచి తిరిగి భూమి స్వాధీనం:
ఇటీవల కాలంలో విశాఖ నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి నుంచి భూములు స్వాధీనం చేసుకోవడం ముమ్మరం అయింది. అందులో ఆక్రమించుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా విశాఖ మాజీ మేయర్, అనకాపల్లీ మాజీ ఎంపీ అయిన సబ్బంహరి జీవీఎంసీకి చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం కట్టారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆక్రమించుకున్న భూమిని ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ సమయంలో అటు అమర్, ఇటు అవంతి ఇద్దరూ చెలరేగిపోయారు.
ఒకే అంశంపై వేర్వేరుగా ప్రెస్ మీట్లు ఎందుకు?
ఈ విషయంలో ఇద్దరూ గంట వ్యవధిలో ప్రెస్‌మీట్లు నిర్వహించారు. ఇద్దరూ కలసి ఇదే విషయంపై ఒకేసారి మాట్లాడి ఉంటే పార్టీ వాయిస్ మరింత బలంగా జనంలోకి వెళ్లేదనే అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అక్కడితో ఆ కథ ముగిసిందని అనుకున్నారంతా. ఆ తర్వాత గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని భీమిలి నేతల వరకు అంతా అధికార పార్టీపై విమర్శలు చేశారు.
టీడీపీపై విరుచుకుపడేందుకు పోటీ పడుతుండటం వెనుక పెద్ద ప్లాన్:
టీడీపీ విమర్శలకు అధికార పార్టీ తరఫున కౌంటర్ ఇచ్చేందుకు మళ్లీ మొదటికొచ్చారు గురుశిష్యులైన అవంతి, అమర్. గీతం వ్యవహారంపై మధ్యాహ్నం గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తే, సాయంత్రం మంత్రి అవంతి ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికుంటాయి. గురుశిష్యులిద్దరూ టీడీపీ నుంచే వైసీపీకి వచ్చారు. అయినా సరే టీడీపీపై విరుచుకుపడేందుకు పోటీ పడుతుండటం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలకు వాళ్లు పదును పెడుతుంటారు.
తన సత్తా తెలిపేందుకు అమర్, మంత్రిగా తన పట్టు చూపించుకునే పనిలో అవంతి:
వైసీపీ అధికారంలోకి రాగానే తనకు రావాల్సిన మంత్రి పదవిని, గురువు అవంతి చివర నిమిషంలో ఎత్తుకుపోయారన్న భావన అమర్‌లో ఉందట. తన సత్తా ఏమిటో అధిష్టానానికి తెలిపేందుకే అమర్ ఒంటికాలిపై ఒంటరి పోరు చేస్తున్నారట. మంత్రిగా తన పట్టు ఏమిటో చూపించుకోవడంతో పాటు టీడీపీ నేతలతో పాత బంధం ఉన్నా సరే పార్టీ పరంగా ఎదుర్కొవడంలో వెనుకడుగు వేసేది లేదనే సంకేతాలివ్వడమనేది అవంతి ఉద్దేశంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి చేజారిపోయే చాన్స్ ఇవ్వకుండా అటాక్‌లో ఒక అడగు ముందుండేలా అవంతి దూకుడు ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. మొత్తానికి గురుశిష్యుల రాజకీయ ఎత్తుగడలు మునుముందు ఇంకెలా ఉంటాయో చూడాల్సిందే.