Botsa Satyanarayana: విజయనగరం వైసీపీకి భారీ షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న బొత్స.. కార్యకర్తల మీటింగ్లో వెక్కి వెక్కి మరీ..
వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)చీపురుపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
Botsa Satyanarayana moved to tears at the Cheepurupalli meeting
- బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగం
- టీడీపీలో చేరిన మజ్జి శ్రీను
- విజయనగరం వైసీపీకి భారీ షాక్
Botsa Satyanarayana: విజయనగరం జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన మేనల్లుడు, ఉత్తరాంధ్ర కీలక నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) వైసీపీని వీడి అధికారికంగా టీడీపీలో చేరడంపై మాట్లాడే క్రమంలో బొత్స తీవ్ర విచారానికి లోనయ్యారు. దీంతో అక్కడే ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఓదార్చారు.
కుటుంబ విబేధాలు, టికెట్ల పోరు.. పార్టీ మార్పునకు ప్రధాన కారణం:
మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా, భీమిలి ఇన్ఛార్జీగా సేవలందించారు. అయితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తన కుమార్తె అనుష పేరును బొత్స(Botsa Satyanarayana) ప్రకటించడమే ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. అదే పదవికి తన కుమార్తె సిరి సహస్రను బరిలోకి దించాలని భావించిన మజ్జి శ్రీను, తనకు చెప్పకుండా అధిష్టానం ఈ నిర్ణయాన్ని మద్దతు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు.
చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా.. కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు?
రాజీనామా అనంతరం మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, లోకేష్, చంద్రబాబుల నాయకత్వంలో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం ఎంపీ లేదా జడ్పీ ఛైర్మన్ టికెట్ రేసులో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతారని మజ్జి శ్రీను పేర్కొనడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
