Byreddy Rajasekhar Reddy: తుగ్లక్ అయినా కొన్ని మంచి పనులు చేశారు.. కానీ, ప్రస్తుత సీఎం మాత్రం..: రాయలసీమ ధర్నాలో బైరెడ్డి రాజశేఖర్
కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర రంగు డబ్బాలు చల్లుతూ, రక్తపాతం అంటూ సినిమాలు తీశారని బైరెడ్డి రాజశేఖర్ అన్నారు.

Byreddy Rajasekhar Reddy
Byreddy Rajasekhar Reddy – Save Rayalaseema: రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఢిల్లీ(Delhi)లో ఇవాళ సేవ్ రాయలసీమ ధర్నా నిర్వహించారు. దీనికి రైతులు, యువకులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. రాయలసీమకు తీగల బ్రిడ్జ్ అవసరం లేదని, బ్రిడ్జ్ కం బ్యారేజ్ కావాలని చెప్పారు. కర్ణాటక చేపడుతున్న అప్పర్ తుంగభద్ర డ్యాముల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పారు.
ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకే కాకుండా తెలంగాణకు కూడా నష్టం జరుగుతుందని అన్నారు. ఆ డ్యాముల గురించి ఏపీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని అన్నారు. రాయలసీమ యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలకు వెళ్లి మట్టిపనులు చేసుకుంటున్నారని చెప్పారు.
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ రాయలసీమకు ఒరిగిందేమీ లేదని బైరెడ్డి రాజశేఖర్ అన్నారు. జగన్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. విదర్భ, రాజస్థాన్ కంటే ఘోరమైన పరిస్థితిలో రాయలసీమ ప్రాంతం ఉందని అన్నారు.
జగన్ కు శ్రీ బాగ్ ఒప్పందం గురించి తెలుసా అని బైరెడ్డి రాజశేఖర్ నిలదీశారు. సినిమా వాళ్ల వల్ల కూడా రాయలసీమ నష్టపోయిందని చెప్పారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర రంగు డబ్బాలు చల్లుతూ, రక్తపాతం అంటూ సినిమాలు తీశారని అన్నారు.