Chandrababu Naidu
Chandrababu Words : మధ్యంతర బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు తొలిసారి మాట్లాడారు. మీరు చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోలేను అని అన్నారు. ”నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులు ఎక్కడికక్కడ నా కోసం సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధిని గుర్తించారు. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను, ఎవరినీ చెయ్యనివ్వను కూడా. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ధన్యవాదాలు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు మాటలు..
”తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అభినందనలు. ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకు వచ్చి నా కోసం సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానం చూపారు. దేశంలో ఎక్కడికక్కడ రోడ్ల మీదకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఒక భారత్ లోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మీరు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను.
Also Read : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
నేను చేసిన అభివృద్ధిని వివరించారు. ఆ రోజు నేను చేసిన పనులు సమాజానికి ఉపయోపడ్డాయి. ఉపయోగం పొందిన వారంతా రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఏపీ తెలంగాణలోనే కాకుండా ప్రపంచం మొత్తం సంఘీభావం తెలిపారు.
నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికీ రాదు. అలాంటి అనుభూతిని మీరు చూపించారు. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. 45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏ తప్పు చేయను, ఎవరినీ తప్పు చేయనివ్వను. అది నా నిబద్దత. ప్రపంచం మొత్తం ఉండే తెలుగువారందరికీ, నాకు సహకారం అందించిన భారతీయులందరికీ, విదేశాల్లో స్పందించిన వారిందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
ఇక అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అన్ని పార్టీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాయకులు, పార్టీలు నాకు పూర్తిగా సహకరించారు. సంఘీభావం తెలిపారు. ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్ గా వచ్చి పూర్తిగా సహకరించారు. పవన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కొంతమంది కాంగ్రెస్ నాయకులు నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు” అని జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.
4 వారాల మధ్యంతర బెయిల్..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకి నవంబర్ 24వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక అభిమానులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
Also Read : జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్
చంద్రబాబుకు హైకోర్టు అదనపు షరతులు..
చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. అదనపు షరతలు విధించింది. చంద్రబాబు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, కేసుపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సీఐడీ తాజా మెమోకు సానుకూలంగా స్పందించింది. రేపటి వరకు ర్యాలీలు చేయవద్దని, మీడియాతో మాట్లాడొద్దని చంద్రబాబుని ఆదేశించింది.