Tirupati Ruia : శవాల దిబ్బపై రాజ్యం ఏలాలనుకుంటున్నారా..? రుయా ఘటనపై చంద్రబాబు, పవన్ ఆవేదన

ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ద ఆక్సిజన్ సరఫరాపై లేదని ఆక్షేపించారు. ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్క లేకుండా శవాల దిబ్బపై రాజ్యం

Tirupati Ruia : శవాల దిబ్బపై రాజ్యం ఏలాలనుకుంటున్నారా..? రుయా ఘటనపై చంద్రబాబు, పవన్ ఆవేదన

Tirupati Ruia

Updated On : May 11, 2021 / 6:28 AM IST

Tirupati Ruia : ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ద ఆక్సిజన్ సరఫరాపై లేదని ఆక్షేపించారు. ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్క లేకుండా శవాల దిబ్బపై రాజ్యం ఏలాలనుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆక్సిజన్ అందక వరుస సంఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని చంద్రబాబు అన్నారు. కోవిడ్ రోగులను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఆక్సిజన్ అందక రోజుకో జిల్లాలో కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. 10 రోజుల్లో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రుయా ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. కర్నూలు, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొదించుకోలేదని నిందించారు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంమయనం పాటిస్తున్నామని, రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేనాని సూచించారు.

చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో 11 మంది మృతి చెందారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాక 5 నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్‌ను పునరుద్దరించకపోయి ఉంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ… సోమవారం(మే 10,2021) రాత్రి 8గంటల నుంచి 8.30గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు చెప్పారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాక కాస్త ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11 మంది మృతి చెందినట్లు తెలిపారు. మిగతా రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని… ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.