Chandrababu Quash Petition : క్వాష్ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు..!
హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి అని ఆలోచన చేస్తున్నారు. న్యాయపరంగా ఏ విధంగా.. Chandrababu Quash Petition

Chandrababu Quash Petition
Chandrababu Quash Petition – Supreme Court : చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో టీడీపీ ఉంది. సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. ఈ మేరకు శుక్రవారం(సెప్టెంబర్ 22) తీర్పు ఇచ్చింది. 68 పేజీలతో ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.
హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేతలు అంతా చర్చించుకుంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి అని ఆలోచన చేస్తున్నారు. న్యాయ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని డిస్కషన్ చేస్తున్నారు. టీడీపీకి చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ రాజమండ్రి వెళ్లారు. సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిశారు. చంద్రబాబు అభిప్రాయం మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో మరో ఆప్షన్ ఉంది. డివిజెన్ బెంచ్ కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. లేదా సుప్రీంకోర్టులో మరోసారి క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలను పార్టీ విభాగం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా హైకోర్టు జడ్జిమెంట్ కాపీని పరిశీలించారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని, గతంలో చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ తయారు చేసుకుంటున్నట్లు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలిపారు. మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారాయన. జగన్ ప్రభుత్వం 30 యాక్ట్ పెట్టి ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. దీని మీద కూడా చట్ట ప్రకారం ఫైట్ చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే, వివిధ రూపాల్లో ప్రజలను సంఘటితపరిచి ప్రభుత్వం దుర్మార్గాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు వైఖరిని ఏ విధంగా అయితే అసెంబ్లీ వేదికగా ఎండగట్టామో అదే విధంగా ప్రజాక్షేత్రంలోకి కూడా పలు రూపాల్లో తీసుకెళతామన్నారు.
ప్రతి ఇంటి గడప తట్టి చంద్రబాబుకి జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ కక్ష పూరిత చర్యలను, గత నాలుగున్నరేళ్లుగా ఏ విధంగా సర్కార్ వైఫల్యం చెందింది అనే విషయాలను ప్రజలకు తెలియజేస్తామని ఎమ్మెల్యే సాంబశివరావు వెల్లడించారు. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో తదుపరి ఏం చేయాలి అనే దానిపై మా లీగల్ టీమ్ దృష్టి పెట్టిందని, మా లీగల్ టీమ్ దగ్గర రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఎమ్మెల్యే సాంబశివరావు చెప్పారు.
మనం ఏ తప్పు చేయలేదని చంద్రబాబు ముందు నుంచి చెబుతున్నారు, మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో క్వాష్ పిటిషన్ వేశామన్నారు, అయితే అక్కడి రూల్స్ ప్రొసీజర్స్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని మీద తదుపరి సుప్రీంకోర్టుకి వెళ్లాలా? లేక ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలా? అనేది మా లీగల్ టీమ్ చూసుకుంటుంది అని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వెల్లడించారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాగా.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ”కేసు అత్యంత కీలక దశలో ఉంది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేము. సుమారు 140 మంది సాక్షులను సీఐడీ విచారించింది. ఇంత చేశాక ఇప్పుడు విచారణ ఆపమనడం సరికాదు. దర్యాఫ్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి” అని తీర్పులో వెల్లడించింది.
వాట్ నెక్ట్స్.. చంద్రబాబు ఏం చేయనున్నారు?
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అటు 2 రోజుల సీఐడీ కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబుకి రెండు రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. దీంతో టీడీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. టీడీపీ నేతలు నెక్ట్స్ ఏం చేయనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. శని, ఆదివారాల నేపథ్యంలో సోమవారం(సెప్టెంబర్ 25) సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా.. హైకోర్టులో డివిజన్ బెంచ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఏసీబీ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.