మోడీ చెప్పినట్లే వింటారా! : ECని చెడుగుడు ఆడిన చంద్రబాబు

ఢిల్లీ : ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, ఓట్ల తొలగింపుపై మా ఫిర్యాదు పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఆయన శనివారం సీఈసీ సునీల్ అరోరాను కలిసి 18 పేజీల నివేదిక అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…ఈవీఎంలు పని చేయకపోవటం, అల్లర్లు జరగటం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు ఆంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఈసీని కోరారు.
చంద్రబాబుతో సహ15 మంది నేతలు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ ఆరోరాతో భేటీ అయ్యారు. ప్రజలు ఓటు వేసే ప్రాధమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదని, ఆలస్యంగా పాలింగ్ ప్రారంభమైనా అదనపు సమయం ఇవ్వకపోవటం పట్ల ఆయన ఈసీపై సీరియస్ అయ్యారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను కచ్చితంగా లెక్కించాలని బాబు కోరగా దానికి సీఈసీ అంగీకరించలేదు. వైసీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని చంద్రబాబు ఆరోపించారు.
“మా నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారు. మోడీ చెప్పినట్లు సీఈసీ నడుచుకుంటోంది. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. జగన్ ఆస్తుల కేసులో నిందితుడు ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ గా నయమించారు”. ట్యాంపరింగ్ కు అవకాశం లేని ఈవీఎంలను వినియోగించాలి. ఈవీఎంల పనితీరుపై చాలాకాలంగా పోరాడుతున్నాం. మేమే కాదు చాలా పార్టీలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. పేపర్ బ్యాలెట్ పెట్టాలని కోరినా పట్టించుకోలేదు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. దీనిపై ఎలక్షన్ కమీషన్ వద్ద సమాధానం లేదు”. అని చంద్రబాబు అన్నారు.