పోలవరానికి సీఎం చంద్రబాబు.. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై ఆరా

ప్రాజెక్ట్ ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది.

Cm Chandrababu Polavaram Tour : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి పర్యటనకు రెడీ అవుతున్నారు. రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు ఆయన వెళ్లనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతీ సోమవారం ఆయన పోలవరం పనుల పురోగతిని సమీక్షించే వారు. ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థకు, అధికారులకు తగు సూచనలు చేసే వారు. అయితే, మళ్లీ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పోలవరం టూర్ కు రెడీ అవుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనతోనే ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ వద్ద హుటాహుటిన యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ ను ఏపీ జల జీవనాడిగా గతంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తుండటంతో పనుల పురోగతిని ఆయన తెలుసుకోనున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి? ఈ ఐదేళ్లలో ఎంత పనులు జరిగాయి? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నదానిపై ప్రధానంగా ఆరా తీయనున్నారు.

ప్రాజెక్ట్ ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అధికారులతో పాటు ఇంజినీర్లతోనూ చంద్రబాబు సమీక్షించబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రాజెక్ట్ పురోగతి ఏంటి? ఎంత కాలంలో పూర్తవుతుంది? అనేదానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : నిన్న సీఎం చంద్రబాబు, నేడు మంత్రి నారాయణ.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి డబుల్ షాక్..!

ట్రెండింగ్ వార్తలు