ఏం చర్చించనున్నారు : అమీత్ షాను కలువనున్న సీఎం జగన్ 

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 05:48 PM IST
ఏం చర్చించనున్నారు : అమీత్ షాను కలువనున్న సీఎం జగన్ 

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జగన్‌ సమావేశం కానున్నారు. ఆయనతో కీలక విషయాలపై చర్చించనున్నారు. మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై షాకు వివరించనున్నారు. ఏపీ సమస్యలు, పెండింగ్‌ నిధుల విడుదలపై అమిత్‌ షాతో జగన్ చర్చించనున్నట్టు సమాచారం.

బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అనంతరం జగన్ అమిత్‌ షాను కలవాల్సి ఉంది. కానీ షా ఢిల్లీ ఫలితాలపై సమీక్షలో బిజీగా ఉండటంతో కేంద్ర హోం శాఖ అపాయింట్‌మెంట్‌ను రీ షెడ్యూల్ చేసింది. దీంతో జగన్ శుక్రవారం అమిత్‌ షాను కలవనున్నారు. అయితే జగన్‌ కేంద్ర పెద్దలను కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ. ఎంపీ విజయసాయిరెడ్డికి మంత్రి పదవి ఇప్పించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారా అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం హోదాను తాకొద్దు పెట్టదని సూచించారు. దీనికి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాన మంత్రి మోడీని సీఎం కలవడం జరిగిందని, దీనిపై టీడీపీ దుష్ట్రచారం చేస్తోందని మంత్రి కన్నబాబు విమర్శించారు.