APలో పంటల గిట్టు బాటు (minimum support price) ధరలు, ఏ పంటకు ఎంతంటే

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 07:40 AM IST
APలో పంటల గిట్టు బాటు (minimum support price) ధరలు, ఏ పంటకు ఎంతంటే

Updated On : October 1, 2020 / 10:39 AM IST

support price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్కర్లేదని భరోసా ఇచ్చిన సీఎం… పంటలకు ముందుగానే ధరలు ప్రకటించారు.


2020-21 సంవత్సరానికి గాను పంటలు, వాటి గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించింది. పసుపు పంట క్వింటాలుకు 6వేల 850 ధరను నిర్ణయించిన ప్రభుత్వం.. ఫిబ్రవరి నుంచి మే వరకు కొనుగోలు చేయనుంది. మిర్చి పంటకు 7వేలు ధర ప్రకటించిన జగన్ సర్కార్.. ఆ పంటను డిసెంబర్‌ నుంచి మే వరకు కొనుగోలు చేస్తుంది.

ఉల్లి పంట క్వింటాలుకు 770ధర ఇస్తామన్న ప్రభుత్వం.. పంటను ఖరీఫ్‌, రబీలోనూ సేకరించనుంది. కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, వరిగలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలకు 2వేల 500, ధాన్యానికి 18వందల68, గ్రేడ్‌ ఏ ధాన్యానికి 18వందల 88 రూపాయలుగా మద్దతు ధరగా నిర్ణయించింది.

జొన్నల్లో మనుషులు తినే రకానికి 2వేల 620, పశువుల దాణా రకానికి 18వందల 50గా ప్రకటించింది. జొన్నల్లో మాల్‌దండి రకానికి 2వేల 640 రూపాయలు ఇవ్వనుంది. సజ్జలు 2వేల 150, రాగులు 3వేల295, మొక్కజొన్నలు 18వందల 50, కందులు 6వేలు, పెసలు 7వేల 196, మినుములు 6వేలు, వేరు శనగకు 5వేల 275 రూపాయల మద్దతు ధర ప్రకటించింది.

కొబ్బరిలో మర రకానికి 9వేల 960, కొబ్బరి బాల్ రకానికి 10వేల 300, కాటన్‌లో పొట్టి పింజకు 5వేల 515, పొడువు పింజ రకానికి 5వేల 825 రూపాయలుగా నిర్ణయించింది. బత్తాయి పంటకు క్వింటాలుకు 14వందలు, అరటి 800, శనగలు 5వేల 100, సోయాబీన్ 3వేల 880, పొద్దు తిరుగుడు పంటకు 5వేల 8వందల 85 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.


వసాయ సీజన్ ప్రారంభానికి ముందే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న సీఎం జగన్.. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించారు. రైతన్నలకు కనీస గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది. గతంలో ఎన్నడా లేని విధంగా చెప్పినదానికన్నా మిన్నగా 3వేల 300కోట్లతో జొన్న, మొక్కజొన్న, అరటి, ఉల్లి, పసుపు తదితర పంటలను కొనుగోలు చేశామంది.


ధాన్యం కొనుగోలు కొరకు మరో 11వేల 500కోట్లు వెచ్చించామన్న జగన్ సర్కార్.. రైతుకు మధ్య దళారీల బెడద, రవాణా ఖర్చు లేకుండా ఈ ఖరీఫ్‌నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే పండిన పంటలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకే ప్రతీ ఆర్బీకేను కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపింది.


ధాన్యం కల్లందగ్గరే కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన 10రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని చెప్పింది. కొనుగోలు ప్రక్రియలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం
ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం కొన్ని విజ్ఞప్తులు చేసింది. మద్దతు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కర్షక్‌లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలి.


అలా నమోదు చేసుకున్న తరువాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకలు లేదా గ్రామ ఉద్యాన సహాయకుల వద్ద పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్తితుల్లో వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు ఆర్బీకేకు తీసుకువచ్చే ధాన్యానికి కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.


అలాగే మార్కెట్‌లో పోటీ పెరగాలి.. తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని ఆకాంక్షించింది. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతుభరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని ప్రకటించింది.