CM Jagan Prakasam District Tour : సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టును, రెండో టెన్నెల్ ను పరిశీలించారు. ఆ తరువాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నాన్న, దివంగత వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును కొడుకుగా నేను పూర్తిచేసి, ప్రారంభించడం సంతోషంగా ఉందని జగన్ అన్నారు. రెండు టన్నెళ్లను వైఎస్ఆర్ కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకుగా నేనే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామని, ఈ టన్నెల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుతో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని జగన్ అన్నారు.
తూర్పు ప్రధాన కాలువ మొత్తం 130.82 కిలో మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి.
ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్ రెగ్యూలేటర్ ఏర్పాట్లు 2018లో పూర్తయ్యాయి.
శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు నల్లమల భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుండి కృష్ణా నదిలోని కొల్లంవాగు వరకు 18.89కి.మీ మేర రెండు సమాంతర సొరంగాల తవ్వకాలు జరిగాయి.
ఇందులో మొదటిది 7మీటర్ల వ్యాసార్ధం, రెండవది 9.2 మీటర్ల వ్యాసార్ధంతో తవ్వకాలు జరిపారు.
జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్ల (టీబీఎం) సహాయంతో తవ్వకాలు చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తయింది.
పశ్చిమ ప్రాంత వరప్రదాయినిగా ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4లక్షల 47వేల 300 ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 10,010.54 కోట్లు.
ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలకు లబ్ధిచేకూరనుంది.
మొదటి దశ లో (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ) ప్రకాశం జిల్లా పరిధిలోని 1,19,000 ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి త్రాగు నీరు.
రెండవ దశ (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ)లో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల పరిదిలోని 3,28,300 ఎకరాలకు సాగు నీరు, 11.25 లక్షల మందికి త్రాగు నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు.
లబ్ధిపొందే అనుబంధ పథకాలు ..
దొనకొండ వద్ద 24,358 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసి నిర్మించనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కు నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.58 టీఎంసీల నీటి సరఫరా కేటాయింపులు చేశారు.
పామూరు, పెదచెర్లోపల్లి మండలాల పరిధిలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్టరింగ్ జోన్ (NIMZ)కు వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 టీఎంసీల నీటి సరఫరా చేయనున్నారు.
వెలిగొండ జంట టన్నెల్స్ పూర్తయిన నేపథ్యంలో ఆర్అండ్ఆర్ ను కూడా త్వరలో పూర్తి చేసి వచ్చే సీజన్లో నల్లమల సాగర్ లో నీళ్లు నింపుతామని ప్రభుత్వం చెబుతుంది.
వెలుగొండ ప్రాజెక్ట్ పరిధిలో ముంపుకు గురై ఖాళీచేసిన గ్రమాలు గొట్టిపడియా, అక్కచెరువు తాండ, సుంకేసుల, కళనూతల, చింతలముడిపి, గుండం చెర్ల, కాటంరాజు తాండ, లక్ష్మీపురం, కృష్ణా నగర్, పొట్టిసుబ్బయ్య పల్లి, సాయి నగర్ కాలనీలు.
సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం గుర్తించబడిన 4617 మంది భాదిత నిర్వాసితులు ఉండగా.. ప్రభుత్వం చేయించిన కమిటీ సర్వే ప్రకారం 18 సంవత్సరాలు నిండిన మరో 2938 యువకులు ఉన్నట్టు గుర్తించడంతో మొత్తం భాదితుల సంఖ్య 7,555మందిగా నిర్ధారించారు.