పార్టీపై దృష్టి పెట్టనున్న జగన్, నేతల విబేధాలపై సీరియస్ ?

CM YS Jagan Serious On YCP Leaders : ఇన్నాళ్లూ పాలనను పట్టించుకున్న జగన్.. ఇక నుంచి పార్టీపైనా దృష్టి సారించనున్నారా? తరచూ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కుతుండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా? విశాఖ డీడీఆర్‌సీ సమావేశంలో వైసీపీ నేతల బహిరంగ వ్యాఖ్యలపై జగన్ రియాక్షన్ ఏంటి? ఆమంచి, కరణం బలరాం వ్యవహారంపై ఎలాంటి ప్లాన్‌ను అమలు చేయబోతున్నారు? ఏపీలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి సీఎం జగన్ పాలనపై పూర్తిగా తన దృష్టి కేంద్రీకరించారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని చాంపియన్‌గా నిలిపేందుకు సరికొత్త పథకాలలో పాలనలో ముందుకెళ్తున్నారు. పాలనపైనే ఇన్నిరోజులు దృష్టి పెట్టిన జగన్.. తొలిసారి పార్టీలోని అంతర్గత విబేధాలపై ఫోకస్ పెట్టారు.
అధికార వైసీపీలో ఇటీవల తరచూ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఇన్నిరోజులు నేతల మధ్య కొనసాగుతోన్న కోల్డ్‌వార్ కాస్తా.. బహిరంగ విమర్శలకు, ఘాటు వ్యాఖ్యలకు దారి తీస్తోంది. పలు జిల్లాల్లోని వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.
విశాఖ డీడీఆర్సీలో సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆ జిల్లాకు చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులముందే విజయసారి తీరును ఎండగట్టారు. ఇదే సమావేశంలోనే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నాడు-నేడు పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
విశాఖ డీడీఆర్‌సీ సమావేశంలో నేతలు బహిరంగ విమర్శలకు దిగడంపై జగన్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతల మధ్య విబేధాలను ఇక ఏమాత్రం ఉపేక్షించరాదన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అమర్నాద్‌లను తాడేపల్లికి పిలిపించారు. మరోవైపు విజయసాయిరెడ్డిని కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ధర్మశ్రీ, అమర్నాద్‌లకు జగన్ ఈ సందర్భంగా జగన్ క్లాస్ తీసుకున్నారు. పార్టీ కీలకనేత, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జీపైనే అందరిముందు వ్యాఖ్యలు చేయడమేంటని సీరియస్ అయ్యారు.
వారి ప్రవర్తనపై జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నేతలపట్ల ఏవైనా బేదాభిప్రాయాలు ఉంటే పార్టీ వేదికల్లో పంచుకోవాలని.. అంతేకాని బహిరంగ వేదికలపై మాట్లాడమేంటని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీలో అందరూ క్రమశిక్షణతో మెలగాలని.. హద్దు దాటితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్టుగా సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ధర్మశ్రీ, అమర్నాద్‌కు క్లాస్ తీసుకున్నారు.
పార్టీలో ఇటీవల నేతల మధ్య బయటపడుతున్న విబేధాలపైనా సీఎం జగన్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. చీరాలో ఆమంచి, కరణం బలరాం మధ్య జరుగుతున్న గొడవపై జగన్ ఆగ్రహంగా ఉన్నారట. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలనే యోచనలో జగన్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తరచూ వివాదాల్లో చిక్కుకోవడంపైనా జగన్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పాలనపై దృష్టి పెట్టిన జగన్.. ఇక నుంచి పార్టీపైనా, నేతల మధ్య నెలకొన్న విభేదాలపైనా దృష్టి సారించనున్నారు. విశాఖ ఘటనతో ఈ సంకేతాలను ఆయన ఇచ్చారు.