Srisailam Laddu Issue: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్ర కోణం..! సీసీటీవీ ఫుటేజ్‌తో బట్టబయలు..
లడ్డూ ప్రసాదంలో బొద్దిక అంటూ కావలికి చెందిన వ్యక్తి కుట్రపూరితంగా గొడవకు దిగారని శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో.

Srisailam Laddu Issue: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్ర కోణం బట్టబయలైంది. దేవస్థానం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనతో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి నివేదిక అందించారు శ్రీశైలం దేవస్థానం ఈవో. లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకు పాల్పడ్డ అంశంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే విధంగా కుట్రలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కుట్రలకు పాల్పడిన వారినే కాకుండా.. వారి వెనుక ఎవరున్నారనే అంశంపైనా ఆరా తీయాలని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. లడ్డూ ప్రసాదంలో బొద్దిక అంటూ కావలికి చెందిన శరత్ చంద్ర కుట్రపూరితంగా గొడవకు దిగారని శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో.
ప్రభుత్వానికి శ్రీశైలం ఈవో నివేదిక..
‘లడ్డూ ప్రసాదంలో బొద్దింక లేదు. కావాలని ఓ మిడతను చొప్పించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన ద్వారా లడ్డూ ప్రసాదంలో బొద్దింక అంశం వెనుక కుట్ర ఉందని తేలింది. లడ్డూలు కొనుగోలు చేసి అందులో మిడతను పెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మిడతను కలిపిన లడ్డూ ప్రసాదాన్ని చూపుతూ బొద్దింక వచ్చిందంటూ గొడవ పెట్టుకున్నట్టు గుర్తించాం. ఫిర్యాదు చేసిన వ్యక్తి గొడవ పడుతుంటే అతనితో పాటు ఉన్న వేరే వ్యక్తులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. సెల్ ఫోన్లను ముందుగానే అందుబాటులో ఉంచుకోవడం, ముందుగా ప్రసాదం కొనుగోలు చేసిన దాంట్లో మిడతను చొప్పించినట్టుగా సీసీటీవీ కెమెరాల పరిశీలనతో అర్థమైంది’ అని ఈవో చెప్పారు.