Gold Themed Mansion: అది ఇల్లా, గోల్డ్ షాపా..! ఆ ఇంట్లో స్విచ్ లు, ట్యాప్ లు, సీలింగ్, ఫర్నీచర్ అంతా మేలిమి బంగారమే.. వీడియో వైరల్
తాము గతంలో పెట్రోల్ బంక్ నడిపే వాళ్లమని, ఆ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టర్ గా మారి ఎన్నో బ్రిడ్జిలు, భవనాలు నిర్మించామని అనేక రోడ్లు వేశామని తెలిపారు.

Gold Themed Mansion: నీ ఇల్లు బంగారం గాను.. అనే సాంగ్ వినే ఉంటారు. ఈ పాట ఆ ఇంటికి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే.. ఆ ఇళ్లంతా బంగారమే కనిపిస్తుంది మరి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఆ ఇంట్లో అన్నీ 24 క్యారెట్ల బంగారంతో చేసిన వస్తువులే ఉన్నాయి. అంతేకాదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్విచ్ లు, ట్యాప్ లు, ఇంటి సీలింగ్, ఫర్నీచర్.. ఇలా ప్రతిదీ గోల్డ్ తోనే చేయించారు.
కంటెంట్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక స్టన్నింగ్ గోల్డ్ థీమ్డ్ మ్యాన్షన్ ను సందర్శించారు. ఆ ఇంట్లో ఫర్నీచర్ నుండి ఎలక్ట్రికల్ సాకెట్ల వరకు ప్రతిదీ స్వచ్ఛమైన బంగారంతో మెరుస్తూ కనిపించింది. ఈ నివాసానికి సంబంధించి వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది.
ఇంటి యజమాని అనుమతితో సరస్వత్ ఆ ఎస్టేట్ మొత్తం తిరిగారు. అరుదైన 1936 వింటేజ్ మెర్సిడెస్ సహా విలాసవంతమైన వాహనాలను ఇంటి యమామాని కలిగున్నారు. ఇళ్లంతా కలియ తిరుగుతున్న సమయంలో గోల్డ్ థీమ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఆఖరికి ఎలక్ట్రికల్ సాకెట్లను కూడా 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయించారని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.
ఆ భవనంలో పది బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఆవరణలో గోశాల కూడా ఉంది. ఇంటి యజమాని తన సక్సెస్ స్టోరీని సరస్వత్ తో పంచుకున్నారు. తాము గతంలో పెట్రోల్ బంక్ నడిపే వాళ్లమని, ఆ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టర్ గా మారి ఎన్నో బ్రిడ్జిలు, భవనాలు నిర్మించామని అనేక రోడ్లు వేశామని తెలిపారు. అలా విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని ఆయన వివరించారు.
‘మాకు కుటుంబంలో 25 మంది ఉంటారు. మా కుటుంబానికి ఒకే ఒక పెట్రోల్ పంపు ఉండేది. దాంతో మనుగడ కష్టమని నేను గ్రహించాను. కాబట్టి నేను ప్రభుత్వ కాంట్రాక్టర్‌షిప్‌లోకి ప్రవేశించాను. మేము ప్రభుత్వం కోసం రోడ్లు, వంతెనలు, భవనాలను నిర్మిస్తాము. మేమిప్పుడు 300 గదుల హోటల్‌ను నిర్మిస్తున్నాము. అదే నా గ్రోత్ జర్నీ” అని యజమాని అన్నారు.
”భారత్ లోని ఇండోర్‌లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు” అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు ఆ ఇంధ్ర భవనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ భవనం సినిమా సెట్ లాగా ఉందని కొందరు కామెంట్ చేశారు. ఈ లాసవంతమైన నివాసం భద్రత గురించి మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
”ఈ వ్యక్తులు ఎంతో వినయంగా కనిపిస్తున్నారు. నీతి, విలువలు లేని వారి దగ్గరికి లక్ష్మీ దేవి రాదు. ప్రియమ్, ఈ అద్భుతమైన వ్యక్తులను మీ పేజీలో ఉంచడం ద్వారా మీరు కూడా ఎల్లప్పుడూ గొప్ప పని చేస్తారని ప్రూవ్ చేసుకున్నారు. చాలా స్ఫూర్తిదాయకం” అని కొందరు నెటిజన్లు అన్నారు. ఇది ఇల్లు కాదు ఇంద్ర భవనం, చాలా అద్భుతంగా ఉంది అని మరికొందరు అన్నారు.
View this post on Instagram