అట్లాంటికాలో ఉన్నామా : అర్లిటీ 2.7, లంబసింగి 0
తెలంగాణలోని అర్లిటీలో 2.7 డిగ్రీలు, ఏపీలోని లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతుంది

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి చలి పెరుగుతోంది. గడ్డ కట్టే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. చలిగాలులకు తోడు అత్యల్ప ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని అర్లిటీలో 2.7 డిగ్రీలు, ఏపీలోని లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతుంది. మనం అట్లాంటికాలో ఉన్నామా.. భారత్‌లో ఉన్నామా.. అనేరీతిలో చలి పంజా విసిరింది.
ఎముకలు కొరికే చలి:
ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. కొమురంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నధరి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి. మన్యం మరో కశ్మీరాన్ని తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా సున్నా డిగ్రీకి చేరుకుంది. లంబసింగిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ పక్కనే ఉన్న చింతపల్లిలో 1.5 డిగ్రీలు నమోదైంది. ఏజెన్సీలోని దల్లాపల్లి, మోదపల్లిల్లో 3, పాడేరులో 4 డిగ్రీల చొప్పున కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలకు పడిపోయాయి.
మరో 4 రోజులు జాగ్రత్త:
సాయంత్రం 4 నుంచే ఎముకలు కొరికే చలి మొదలవుతోంది. ఎన్నడూ లేనంతగా ఏజెన్సీలో సాయంత్రం నుంచి మంచు తేలికపాటి వర్షంలా కురుస్తోంది. దీంతో స్థానికులు కశ్మీర్‌లో మంచుకొండల్లో గడపుతున్న ఫీలింగ్‌ని పొందుతున్నారు. గడ్డకట్టే విధంగా చలి పంజా విసరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు ఎక్కువయ్యాయి. పగలు, రాత్రి సమయాల్లో మంచు దుప్పటి కమ్మేయడంతో పొగమంచుకు వాహనదారులు కష్టాలు పడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న శీతల పవనాలతోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వచ్చే నాలుగు రోజులు చలితీవ్రత కొనసాగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.